France: ఫ్రాన్స్ లో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..
సెనెట్‌లో చర్చలు జరిపి, బిల్లుపై నిర్ణయం
పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా ఓ చట్టం తీసుకురానుంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron) ప్రకటించారు. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించడాన్ని నిషేధించే బిల్లుకు ఫ్రాన్స్ దిగువ సభలోని శాసనసభ్యులు మద్దతిచ్చారన్నారు. సెనెట్‌లో దీనిపై చర్చలు జరిపి, బిల్లుపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
పిల్లలు గంటలకొద్దీ సమయాన్ని స్క్రీన్‌కు కేటాయించడం వల్ల వారిలో తలెత్తుతున్న ఆరోగ్య, మానసిక సమస్యలను నివారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మేక్రాన్ వెల్లడించారు. ఫిబ్రవరి చివరికి సెనెట్ ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాపై నిబంధనలు సెప్టెంబర్ 1నుంచి అమల్లోకి వస్తాయన్నారు. 15 ఏళ్లలోపు పిల్లల ఖాతాలను తొలగించడానికి సామాజిక మాధ్యమాల సంస్థలకు డిసెంబర్ 31 వరకు సమయం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లులో పాఠశాలల్లో పిల్లల మొబైల్ ఫోన్ వాడకం పైనా నిషేధం ఉంటుందన్నారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే టీనేజర్ల సోషల్ మీడియా వాడకంపై దేశవ్యాప్తంగా నిషేధాన్ని ప్రవేశపెట్టిన రెండో దేశంగా ఫ్రాన్స్ నిలుస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం దేశంలోని పదహారేళ్ల కన్నా తక్కువ వయసున్నవారు సోషల్ మీడియా (Social Media) వాడకుండా నిషేధించింది. ఇతర దేశాలు కూడా ఈ నిబంధనలను అమలుచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.