ఇజ్రాయెల్ వైమానిక దాడులతో శిథిలాల గుట్టను తలపిస్తున్న గాజాలో మానవతా సంక్షోభం నెలకొంది. గాజా ఆస్పత్రులు క్షతగాత్రులతో కిక్కిరిసిపోగా...ఇంధన కొరత కారణంగా అనేక చోట్ల సేవలను నిలిపివేస్తున్నారు. గాజాలోని మొత్తం ఆస్పత్రుల్లో మూడో వంతు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో మూడింట రెండో వంతు ఇప్పటికే మూసివేశారు. ఇంధనం తమకు అందకపోతే గాజాలో తమ సేవలను నిలిపివేస్తామని ఐరాస ఏజెన్సీ UNRWA హెచ్చరించింది. ఇంధన కొరత కారణంగా ప్రాణాలు రక్షించే ఆపరేషన్లు త్వరలోనే నిలిచిపోనున్నాయని దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో ఉన్న ఆస్పత్రులు హెచ్చరిస్తున్నాయి. రక్తం కొరత కూడా తీవ్రంగా ఉందని తెలిపాయి. పెను విపత్తుకు దగ్గర్లో ఉన్నట్లు పేర్కొన్నాయి.
గాజాకు ఇంధనం సరఫరా చేయడానికి ఇజ్రాయెల్ ఒప్పుకోవడం లేదు. ఇంధనం పంపిస్తే హమాస్ మిలిటెంట్ సంస్థ దాన్ని కాజేసి తమ మిలటరీ ఆపరేషన్ల కోసం ఉపయోగిస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. గాజాకు ఇంధన సరఫరాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని చెబుతోంది. హమాస్ వద్ద భారీగా ఇంధన నిల్వలు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF ఫోటోలను విడుదల చేసింది. ఇంధనం కోసం హమాస్‌ను అడగాలంటూ ఐక్యరాజ్య సమితికి ఇజ్రాయెల్ సూచించింది. హమాస్ వద్ద 5 లక్షల లీటర్ల ఇంధనం ఉందంటూ ఇజ్రాయెల్ ఫోటోలు విడుదల చేసింది.
ప్రస్తుతం రఫా సరిహద్దు గుండా తక్కువ సంఖ్యలోనే ఆహారం, నీరు, ఔషధాలతో కూడిన ట్రక్కులు గాజాకు చేరుతున్నాయి. గాజాకు ఇంధన సరఫరాను మాత్రం ఇజ్రాయెల్ అనుమతించడం లేదు. ఇంధన సరఫరా విషయంలో ఇజ్రాయెల్ వాదనలో నిజం లేకపోలేదని అమెరికా కూడా ఆ దేశానికి మద్దతుగా నిలుస్తోంది. ఈజిప్టు సరిహద్దుల్లో 4 లక్షల లీటర్ల ఇంధనంతో తమ ట్రక్కులు సిద్ధంగా ఉన్నాయని ఐరాస వెల్లడించింది. ఆ ఇంధనం రెండున్నర రోజులకు సరిపోతుందని తెలిపింది. మరోవైపు హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేసేలా మధ్యవర్తులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు బందీల్లో నలుగురిని మాత్రమే హమాస్ విడుదల చేసింది.
ఇజ్రాయిల్ దాడుల్లో పాత్రికేయులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. పాలస్తీనా జర్నలిస్టు సయీద్ అల్ హలాబి బుధవారం ఉత్తర గాజాలో జరిగిన బాంబు దాడిలో మరణించారు. ఇప్పటివరకు 21 మంది పాలస్తీనా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు ఇజ్రాయిల్, ఒక లెబనాన్ జర్నలిస్టు కూడా చనిపోయారు.