H-1B Visa : భారతీయులకు అమెరికా షాక్.. వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా
కొత్త షెడ్యూల్‌పై ఉత్కంఠ
భారతీయులకు హెచ్-1బీ వీసా కష్టాలు వెంటాడుతున్నాయి. హెచ్1-బీ వీసాలపై ట్రంప్ ఆంక్షలు పెట్టాక భారతీయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక సోషల్ మీడియా నిబంధనలు కొత్త తలనొప్పి తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియా నిబంధనలు అమల్లోకి రావడంతో హెచ్-1బీ వీసాల అపాయింట్‌మెంట్‌లు వాయిదా పడ్డాయి. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కాన్సులేట్‌కు ఇంటర్వ్యూకి వచ్చే దరఖాస్తుదారుడి ప్రవేశాన్ని నిరాకరిస్తామని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది.
అమెరికా విదేశాంగ శాఖ కొత్త సోషల్ మీడియా నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో భారతదేశంలోని H-1B వీసా దరఖాస్తుదారులకు ఇక్కట్లు వచ్చి పడ్డాయి. దీంతో ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. ఈ మేరకు భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి వీసా దరఖాస్తుదారులకు ఒక సలహా జారీ చేసింది. కొత్త షెడ్యూల్ మార్చి, 2026లో వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్‌లో జరగాల్సిన అపాయింట్‌మెంట్‌లన్నీ వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అయితే ఇది కూడా కచ్చితమైన తేదీ కాదని పేర్కొంది.
ఇటీవల వైట్‌హౌస్ దగ్గర ఆప్ఘని వ్యక్తి నేషనల్ గార్డ్స్‌పై కాల్పులకు తెగబడ్డాడు. ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భద్రతాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాలకు ఎంట్రీ కూడా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. తాజాగా జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 15 నుంచి ఆన్‌లైన్ ఖాతాలపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సోషల్ మీడియా ప్రొఫైల్‌లోని గోప్యతా సెట్టింగ్‌లను పబ్లిక్‌గా ఉంచాలని తెలిపింది. విద్యార్థులు, సందర్శకుల సోషల్ మీడియా ఖాతాలు బహిర్గతంగా ఉండాలని సూచించింది. కొత్త నిబంధనలు రానున్న నేపథ్యంలో హెచ్-1బీ వీసాల ఇంటర్వ్యూలను నిలిపివేసింది. కొత్త షెడ్యూల్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. దీంతో మరిన్ని రోజులు భారతీయులకు ఇబ్బందులు తలెత్తవచ్చు.