Haiti : చేతబడి అనుమానంతో హైతీలో 184 మంది వృద్ధుల ఊచకోత
చేతబడి అనుమానంతోనే;
హైతీలోని అత్యంత పేరుమోసిన మోనెల్ ఫెలిక్స్ అనే గ్యాంగ్‌స్టర్ దారుణానికి పాల్పడ్డాడు. హైతీ రాజధాని పోర్ట్-ఔ-ప్రిన్స్‌కు సమీపంలోని సిటేసోలీల్ ప్రాంతంలోని మురికివాడలో నివసించే దాదాపు 184మందిని హతమార్చాడు. వీరిలో అందరూ వృద్ధులే (60ఏళ్లు పైబడినవారు) ఉన్నారు. గత శుక్ర, శనివారాల్లో రెండు రోజుల్లోనే వీరందరినీ హతమార్చినట్లు జాతీయ మానవ హక్కుల రక్షణ వ్యవస్థ (ఆర్‌ఎన్‌డీడీహెచ్) తన నివేదికలో వెల్లడించింది. ఇంతమందిని, అందరూ వృద్ధులనే ఈ గ్యాంగ్ స్టర్ ఎందుకు హత్యచేశాడంటే.. తన బిడ్డ అనారోగ్యం పాలయ్యాడని. చేతబడి చేసి తన బిడ్డను అనారోగ్యం పాల్జేశారనే కోపంతో ఇంతటి దారుణానికి గ్యాంగ్ స్టర్ పాల్పడ్డాడు.
కొద్దికాలంగా గ్యాంగ్ స్టర్ కొడుకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కొడుకును పూజారి వద్దకు తీసుకెళ్లి చూపించగా.. కొందరు మంత్రాలు (చేతబడి) చేయడంతోనే మీ కొడుకు ప్రాణాంతక వ్యాధి భారినపడినట్లు చెప్పాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్యాంగ్ స్టర్.. కత్తులు, కొడవళ్లు పట్టుకొని తన ముఠా సభ్యులతో కలిసి చుట్టుపక్కల ఇండ్లలోకి వెళ్లి 60ఏళ్లు పైబడిన వారిని ఊచకోత కోశాడు. శుక్రవారం ఒక్కరోజులోనే 60 మందిని చంపేశాడు. శనివారం మధ్యాహ్నం అతడి కొడుకు చనిపోవడంతో మరింత ఆగ్రహంతో వృద్ధులను దొరికినవారిని దొరికినట్లు హత్య చేశాడు. ఇలా మొత్తం 184 మందిని గ్యాంగ్ స్టర్ బలితీసుకున్నాడు.
గ్యాంగ్ స్టర్ భారి నుంచి వృద్ధులను కాపాడేందుకు ప్రయత్నించిన బైకర్లు, ట్యాక్సీ డ్రైవర్లను కూడా అతను తుపాకీతో కాల్చిచంపేశాడని స్థానికులు చెప్పినట్లు జాతీయ మానవ హక్కుల రక్షణ వ్యవస్థ తన రిపోర్టులో పేర్కొంది.