Yahya Sinwar: తుర్కియేలో మరో వివాహం చేసుకున్న సిన్వర్‌ సతీమణి!

ఇజ్రాయెల్ కాల్పుల్లో హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతి, అంతకుముందే గాజా నుంచి మారుపేరుతో పరారైన సిన్వర్ భార్య;

Update: 2025-07-27 06:45 GMT

గాజాలో ఉగ్రవాద సంస్థ హమాస్ ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని, అప్పటి వరకు యుద్ధం ఆపేదిలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు గతంలోనే స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ సరిహద్దులో పార్టీ చేసుకుంటున్న పౌరులపై హమాస్ ఉగ్రదాడి తర్వాత నెతన్యాహు ఈ భీకర శపథం చేశారు. గాజాలోని హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు తీవ్రం చేశారు. దీంతో హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ సహా కీలక ఉగ్రవాదులు చనిపోయారు. గతేడాది అక్టోబర్ లో యహ్యా సిన్వర్ ను ఇజ్రాయెల్ బలగాలు తుదముట్టించాయి. అయితే, అంతకుముందే యహ్యా సిన్వర్ భార్య పరారైందని తాజాగా వెల్లడైంది.

యహ్యా సిన్వర్ భార్య సమర్ ముహమ్మద్ అబు జమార్ ప్రస్తుతం తుర్కియేలో రహస్యంగా జీవిస్తోందని సమాచారం. సిన్వర్ మరణించడానికి చాలా ముందుగానే సమర్ తన పిల్లలతో కలిసి దొంగ పాస్ పోర్టుతో దేశం దాటినట్లు గాజాలోని హమాస్ వర్గాలు వెల్లడించాయని వై నెట్ మీడియా ఓ కథనంలో పేర్కొంది. గాజాలోని స్మగ్లింగ్ ముఠా సమర్ ను రఫా బార్డర్ గుండా ఈజిప్ట్ లోకి చేర్చిందని వై నెట్ పేర్కొంది. సాధారణంగా ఇలా మనుషులను అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు స్మగ్లింగ్ ముఠాలు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తాయని, సాధారణ గాజా మహిళకు ఇంత మొత్తం చెల్లించే స్తోమత ఉందని తెలిపింది.

ఈ విషయమే సమర్ పరారైన విషయాన్ని బయటపెట్టిందని వివరించింది. గాజాకు చెందిన ఓ సామాన్య మహిళకు చెందిన పాస్ పోర్ట్ తో సమర్ తన పిల్లలను తీసుకుని దేశం దాటిందని, తొలుత ఈజిప్ట్ లోకి అక్కడి నుంచి తుర్కియేలోకి ప్రవేశించిందని తెలిపింది. ఆ తర్వాత అక్కడి స్థానికుడిని వివాహం చేసుకుని మారుపేరుతో తుర్కియేలోనే జీవిస్తోందని వై నెట్ వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారం హమాస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసే నెట్ వర్క్ సాయంతో జరిగిందని పేర్కొంది. ఇదే మార్గంలో యహ్యా సిన్వర్ సోదరుడి భార్య నజ్వా కూడా దేశం దాటిందని తెలిపింది. అయితే, నజ్వా ఏ దేశంలో ఆశ్రయం పొందిందనే వివరాలు తెలియరాలేదని వివరించింది.

Tags:    

Similar News