Britain : బ్రిటన్‌లో భారీ వర్షాలు

తుపాను​ ధాటికి బ్రిటన్​ గజగజ

Update: 2024-01-07 00:30 GMT

బ్రిటన్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. ఇంగ్లాండ్‌లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు ఇలాగే కొనసాగితే వరద ప్రభావం మరింత పెరుగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. 

బ్రిటన్‌లో హెంత్‌ తుపాను భారీ నష్టాన్ని కలిగించింది. చాలా ప్రాంతాలు, ముఖ్యంగా నదీ తీర నగరాలైన నాటింగ్‌హామ్‌ షైర్, వోర్సెస్టర్‌ షైర్,  యార్క్‌షైర్‌లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. భీకర గాలులతో కూడిన భారీ వర్షాలకు వెయ్యికిపైగా ఇళ్లు, దుకాణ సముదాయాలు నీటమునిగాయి. వ్యవసాయ భూముల్లోనూ..వరద నిలిచింది. వీధులన్నీ వాగులను తలపిస్తున్నాయి. వేలాది కార్లు..వరద ప్రభావానికి దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాయి. 

నాటింగ్‌హామ్‌ షైర్ కౌంటీని ఈ స్థాయిలో వరద ముంచెత్తడానికి ప్రధాన కారణం ట్రెంట్ నది ఉప్పొంగడమేనని వాతావరణ విభాగం తెలిపింది. ఇక్కడ వేలాది ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఇళ్లలో గృహోపకరణాలు ధ్వంసమయ్యాయి. రైలు పట్టాలపై ఎక్కడికక్కడ వరద నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ నాటింగ్‌హామ్‌ షైర్‌లో పర్యటించి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని సునాక్‌ ప్రకటించారు.

Tags:    

Similar News