Khalistanis Attack: హిందూ భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి అమానుషం అన్న ట్రూడో
కెనడాలో ఖలిస్థానీ గ్రూప్ దుశ్చర్య..;
బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిర్‌లోని భక్తులపై ఖలిస్తానీలు దాడికి దిగారు. ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి వేగంగా స్పందించినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని ట్రూడో.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కెనడియన్ ఎంపీలతో సైతం పోస్ట్ చేయడంతో తొందరగా వైరల్ అయింది. ఈ సంఘటన యొక్క వీడియోలో ఆలయం వెలుపల ఖలిస్థానీ అనుకూల గ్రూపులతో సంబంధం ఉన్న జెండాలను ప్రదర్శించడంతో పాటు కర్రలతో చిన్నారులు, మహిళలపై కూడా దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సంఘటన గురించి తెలిసన కెనడియన్ పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు. పీల్ ప్రాంతీయ పోలీసు చీఫ్ నిషాన్ దురైయప్ప అందరు సంయమనం పాటించాలని కోరారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది.. హింస, నేరపూరిత చర్యలను తాము సహించమన్నారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కెనడియన్ పోలీసులు వెల్లడించారు.
"ఈరోజు బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌లో జరిగిన హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉంది. ఈ సంఘటనపై త్వరగా స్పందించి బాధితులను కాపాడినందుకు పీల్ ప్రాంత పోలీసులకు ధన్యవాదాలు. అంతేగాకుండా వేగంగా దర్యాప్తు చేయడం ప్రశంసనీయం" అని ట్రూడో తన పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ఆ దేశంలోని పలు హిందూ సంఘాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.