Air India: ఇజ్రాయిల్ అతిపెద్ద ఎయిర్‌పోర్టుపై హౌతీ క్షిపణి దాడి.
ఎయిర్ ఇండియా టెల్ అవీవ్ విమాన సర్వీసులు రెండు రోజులు రద్దు;
హౌతీ ఉగ్రవాదులు ఆదివారం రోజు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సై్ల్‌తో దాడి చేశారు. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపైకి మిస్సైల్‌ని ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇజ్రాయిల్‌కి ఉన్న బలమైన 4 అంచెల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని దాటి క్షిపణి దాడి జరగడం సంచలనంగా మారింది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో పడకుండా అడ్డగించిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. ఒక్కసారిగా మిస్సైల్ దాడి జరగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో కనీసం 8 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు తెలిపారు.
క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిపై ఏడు రెట్లు అధిక దాడి చేస్తామని అన్నారు. మరోవైపు, ఈ దాడిని హౌతీ నాయకులు ప్రశంసించారు. సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని అభినందించారు. ఇజ్రాయిల్‌తో ఘర్షణలో తమకు ఎలాంటి రెడ్‌లైన్స్ లేవని, ఇజ్రాయిల్ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని హౌతీ సీనియర్ అధికారి మొహమ్మద్ అల్-బుఖైతి అల్-అరబీ టీవీకి తెలిపారు.
ఎయిర్ ఇండియా టెల్ అవీవ్ విమాన సర్వీసులు రెండు రోజులు రద్దు
బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడి జరపడంతో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. టెల్ అవీవ్‌కు నడిచే తమ విమాన సర్వీసులను తక్షణమే రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది.
విమానాశ్రయంపై దాడి జరిగిన సమయంలో, ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ బయలుదేరిన ఎయిరిండియా విమానం AI139ను అబుదాబికి మళ్లించినట్లు సంస్థ తెలిపింది. విమానం అబుదాబిలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, త్వరలోనే తిరిగి ఢిల్లీకి చేరుకుంటుందని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో, మే 6 వరకు టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ఒక ప్రకటనలో వివరించింది.
ప్రయాణికులకు సహాయం అందించేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని ఎయిరిండియా తెలిపింది. మే 4 నుంచి మే 6 మధ్య చెల్లుబాటు అయ్యే టిక్కెట్లు కలిగి ఉన్న ప్రయాణికులు ఎటువంటి అదనపు రుసుము లేకుండా తమ ప్రయాణ తేదీలను మార్చుకోవచ్చని లేదా టికెట్ రద్దు చేసుకుని పూర్తి వాపసు పొందవచ్చని హామీ ఇచ్చింది. "ఎయిరిండియాలో, మా ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత అని మరోసారి స్పష్టం చేస్తున్నాము" అని ప్రకటనలో పేర్కొన్నారు.