Houthi Rebels: మళ్లీ రెచ్చిపోయిన హౌతీ తిరుగుబాటుదారులు..

హిందూ మహాసముద్రంలో నాలుగు నౌకలపై దాడి

Update: 2024-04-30 01:30 GMT

గాజాపై ఇజ్రాయేల్ కొనసాగిస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా యెమెన్‌లోని ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరిగినప్పటి నుంచి యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. మరోవైపు హిందూ మహా సముద్రంలో నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు పెంచారు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న దేశాలకు చెందిన నౌకలపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. హిందూ మహా సముద్రంలో డ్రోన్ దాడులను ప్రారంభించామని.. MSC ఓరియన్ కంటైనర్ షిప్‌ను లక్ష్యంగా చేసుకున్నామని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు. LSEG డేటా ప్రకారం.. పోర్చుగీస్- ఫ్లాగ్ ఉన్న MSC ఓరియన్ పోర్చుగల్, ఒమన్ మధ్య పని చేస్తోంది.

ఇరాన్-మద్దతుగల హౌతీ మిలిటెంట్లు నవంబర్ నుంచి ఎర్ర సముద్రం, బాబ్ అల్- మందాబ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో పదేపదే డ్రోన్, క్షిపణి దాడులను కొనసాగిస్తున్నాయి. దక్షిణాఫ్రికా చుట్టూ సుదీర్ఘమైన ప్రయాణాలకు నౌకలను నిరోధిస్తున్నారు. ఈ దాడుల వల్ల ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం తీవ్రతరం అవుతుందనే భయాలను కూడా పెంచుతుంది. అయితే, నౌకలపై దాడులకు ప్రతిస్పందనగా, అమెరికా, బ్రిటన్ హౌతీ రెబల్స్ స్థానాలపై దాడి చేశాయి. హిందూ మహాసముద్రంలో ఉన్న భారత నావికాదళం ఏప్రిల్ 26వ తేదీన పనామా జెండాతో కూడిన ముడి చమురు ట్యాంకర్‌కు సహాయం చేసిందని ఆదివారం వార్తలు వచ్చాయి. హౌతీ తిరుగుబాటుదారులు ఈ ట్యాంకర్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు సమాచారం. కాగా, ఓడలో 22 మంది భారతీయులతో సహా మొత్తం 30 మంది సిబ్బంది ఉన్నారు. 

Tags:    

Similar News