Pakistan: ఇమ్రాన్ ఖాన్ క్షేమమే అంటున్న రావల్పిండి జైలు అధికారులు
పాకిస్థాన్ పార్లమెంట్‌లో మాత్రం గందరగోళం..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కస్టడీలో మరణించినట్లు వదంతులు వ్యాపించిన నేపథ్యంలో రావల్పిండిలోని అదియాలా జైలు వెలుపల ఉద్రిక్తతలు చోటుచేసుకున్న మరుసటి రోజున ఆయన ఆరోగ్యంపై జైలు పాలనా యంత్రాంగం గురువారం స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన జైలులోనే సురక్షితంగా ఉన్నారని ఓ ప్రకటనలో జైలు యంత్రాంగం స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యంపై వెలువడిన వదంతులను కొట్టివేస్తూ మాజీ ప్రధానికి పూర్తి వైద్య సహాయం అందుతోందని తెలిపినట్లు జియో న్యూస్ వెల్లడించింది.
ఇమ్రాన్ ఖాన్ అంశంపై నిన్న పాకిస్థాన్ పార్లమెంట్‌లో రచ్చ చోటు చేసుకుంది. పాకిస్థాన్ పార్లమెంటు దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) సభ్యుడు ఫైసల్ జావేద్ మాట్లాడుతూ.. రాబోయే 24 గంటల్లో ఇమ్రాన్ తన కుటుంబాన్ని కలవడానికి అనుమతించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇమ్రాన్‌ను ఎందుకు పూర్తిగా ఏకాంత నిర్బంధంలో ఉంచారు? అని ప్రశ్నించారు. ఇమ్రాన్ కుటుంబాన్ని కలవడానికి అనుమతి లేకపోవడంపై పీటీఐ ఎంపీ ఫైసల్ జావేద్ పార్లమెంటులో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. పాక్ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి తలాల్ చౌదరి ఈ అంశంపై స్పందించారు. జైలు నిబంధనలను ఉదహరించారు. ఇమ్రాన్ ఖాన్ వీఐపీ ఖైదీ అని, జైలు మాన్యువల్ ప్రకారం మాత్రమే ఆయనను కలవడానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పాక్ పార్లమెంట్‌లో గందరగోళం తలెత్తింది. పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఇమ్రాన్ ముగ్గురు సోదరీమణులు ఇమ్రాన్‌ను మూడు వారాల పాటు కలవడానికి అనుమతి లేదని ఆరోపిస్తున్నారు. న్యాయవాది సైతం గత కొన్ని వారాలుగా కలవలేదు. ఆయనకు సైతం అనుమతి కల్పించలేదు. దీంతో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఇమ్రాన్ ఖాన్‌పై విషప్రయోగం చేశారని లేదా అడియాలా జైలు నుంచి తరలించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జైలులోనే ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యానికి గురయ్యారని పుకార్లు ఉన్నాయి. కానీ ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా క్షేమంగా ఉన్నారని జైలు యంత్రాంగం స్పష్టం చేసింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, జైలులోని సౌకర్యాలను ఆస్వాదిస్తున్నారని చెప్పింది.