Donald Trump: ఉపన్యాసం వద్దు.. ట్రంప్‌పై న్యాయమూర్తి ఆగ్రహం
మన్‌హట్టన్ కోర్టు విచారణకు హాజరైన మాజీ అద్యక్షుడు;
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ ట్రయల్ కోర్టులో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫ్యామిలీ బిజినెస్‌కు చెందిన కేసులో ఆయన జడ్జితో వాదించారు. ఓ కేసులో కోర్టు విచారణకు హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జడ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉపన్యాసాలు ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి చిర్రెత్తుకొచ్చి.. లెక్చర్లు ఇవ్వడం ఆపి, సమాధానం చెప్పండని అసహనం వ్యక్తం చేశారు. పదేపదే జడ్జిను తప్పుపట్టేందుకు ట్రంప్ ప్రయత్నించారు. సుమారు నాలుగు గంటల పాటు ట్రంప్.. కోర్టులో విచారణ ఎదుర్కొన్నారు. తానేమీ బ్యాంకులను మోసం చేయలేదన్నారు. ట్రంప్ సంస్థ తమ ఆస్తులను విలువను అధికంగా చూపి, బ్యాంకుల వద్ద నుంచి అధిక మోతాదులో రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ట్రంప్ సంస్థపై 250 మిలియన్ల డాలర్ల జరిమానా విధించాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు.
మన్‌హటన్ ఫెడరల్ కోర్టురూమ్‌లో ఆయన విచారణ ఎదుర్కొన్నారు. ఫ్లోరిడాలోని మార్ఏ లాగో ఎస్టేట్, న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్, స్కాట్‌లాండ్‌లోని గోల్ఫ్ కోర్స్ ప్రాపర్టీల విలువ ఎంతో చెప్పాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేశారు. తన విలువ బిలియన్ల డాలర్లు ఉంటుందని ట్రంప్ కోర్టులో తెలిపారు. తన పర్సనల్ ఇమేజ్‌తో ప్రాపర్టీ ఆస్తుల విలువ పెరిగినట్లు చెప్పారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లిటిటా జేమ్స్ ఈ కేసును దాఖలు చేశారు. ట్రంప్ కంపెనీ తమ ఆస్తుల విలువను అధికంగా చూపించినట్లు అటార్నీ తన కేసులో ఆరోపించారు. బోనులో నిలబడి సమాధానాలు ఇచ్చే క్రమంలో జడ్జి అర్థర్ ఎన్గోరాన్ పలుమార్లు ట్రంప్‌ను మందలించారు. ఇది రాజకీయ సభ కాదని గుర్తు చేసి.. ఉపన్యాసాలు కట్టిపెట్టి అడిగిన ప్రశ్నలకు మాత్రమే క్లుప్తంగా సమాధానమివ్వాలంటూ పదే పదే సూచించారు. అయినాసరే, ట్రంప్ మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. అసిస్టెంట్ అటార్నీ జనరల్ కెవిన్ వాలెస్ అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘ జవాబులిస్తుండడంతో జడ్జి అసహనానికి గురయ్యారు. అంతేకాదు, మీ క్లయింట్‌ను నియంత్రించాలంటూ ట్రంప్ తరఫు లాయర్లకు సూచించారు.