Ahmedabad Plane Crash:విమాన ప్రమాదంపై దర్యాప్తునకు ఐరాస ప్రతిపాదన, తిరస్కరించిన భారత్
దర్యాప్తునకు భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో నాయకత్వం;
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై రెండు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తు్న్నాయి. ఇప్పటికే యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు సాంకేతిక సహాయంతో ఫ్లైట్ రికార్డుల నుంచి డేటాను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు జూన్ 26న పౌర విమానయాక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక ఈ దర్యాప్తునకు భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) నాయకత్వం వహిస్తోంది.
అయితే ఈ దర్యాప్తులో తాము కూడా పాలుపంచుకుంటామని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీకి చెందిన విమాన సంస్థ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనను భారతదేశం తిరస్కరించినట్లుగా సమాచారం. దర్యాప్తునకు మరింత తోడ్పాటుకు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) తన దర్యాప్తుదారులలో ఒకరిని సహాయంగా అందిస్తామని తెలిపింది. భారతదేశం కోరకుండానే ఈ సాయం చేయడానికి ముందుకొచ్చింది. దర్యాప్తుదారునికి పరిశీలకుడి హోదాకు అనుమతించాలని అభ్యర్థించింది. కానీ భారత అధికారులు మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు రాయిటర్స్ తన నివేదికలో పేర్కొంది. అయితే ఐసీఏవో ప్రతిపాదనపై ఏఏఐబీ మాత్రం అధికారికంగా స్పందించలేదు.
2014లో మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్ 17, 2020లో ఉక్రెయిన్ జెట్‌లైనర్ కూలిపోయిన ఘటనలో ఐసీఏవో సాయం చేసింది. ఆ రెండు దేశాలు అధికారికంగా ఆహ్వానించడం వల్ల సాయం చేసింది. కానీ భారత్ మాత్రం అధికారికంగా ఆహ్వానించలేదు. ముందుగానే ప్రతిపాదన పెట్టింది. అందుకు భారత్ అంగీకరించలేదు. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వివరణాత్మక బ్రీఫింగ్‌లు లేకపోవడం కారణంగా ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోందని.. ఈ కారణం చేతనే అంతర్జాతీయ విమాన సంస్థ సహాయం చేయడానికి వచ్చినట్లుగా రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం బయల్దేరింది. కొన్ని సెకన్లలోనే హాస్టల్‌పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్‌లో ఉన్న 34 మంది మెడికోలు చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.