Mumbai terror attack: తహవూర్ రాణా పిటిషన్ కొట్టివేత
భారత్‌కు అప్పగించడానికి మార్గం సుగమం;
ముంబయి ఉగ్రదాడుల్లో 166మందిని బలితీసుకున్న నేరస్థులకు శిక్షపడేలా భారత్ చేస్తున్న పోరాటానికి భారీ విజయం లభించింది. పాకిస్థాన్ మూలాలు కలిగిన కెనడా వ్యాపారవేత్త తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఆమోదం తెలిపింది. భారత్-అమెరికా మధ్య నేరస్థుల ఒప్పందాన్ని సవాల్ చేస్తూ రాణా తరఫు న్యాయవాది చేసిన వాదనలను తోసిపుచ్చింది.
దీంతో 2008లో ముంబయిపై జరిగిన ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు ప్రధాన అడ్డంకి తొలగింది. భారత్‌కు అప్పగింత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాణా వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను అమెరికా కోర్టు కొట్టేసింది.
2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకరదాడిలో దాదాపు 166మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో తహవూర్ రాణా కీలక నిందితుడిగా ఉన్నాడు. పాకిస్థాన్ మూలాలు కలిగిన కెనడాకు చెందిన వ్యాపారవేత్త రాణా ముంబయి ఉగ్రదాడులకు ఆర్థికసాయం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేగాక, ఈ కేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్ హెడ్లీకి రాణా అత్యంత సన్నిహితుడు. ఉగ్రదాడులకు ముందు ముంబయిలో తహవూర్ రాణా తుది రెక్కీ నిర్వహించినట్లు. ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన డెవిడ్ హెడ్లీ విచారణలో భాగంగా గతంలోనే వెల్లడించాడు.
అమెరికాతో ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందం మేరకు జూన్ 10న రాణాను అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరుతూ భారత్ ఫిర్యాదు చేయగా, జో బైడెన్ సర్కార్ కూడా మద్దతు తెలిపింది. కాలిఫోర్నియా కోర్టు భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాణా....అదే కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలుచేశారు. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన రాణా తరఫు న్యాయవాదులు....కోర్టు తీర్పు భారత్-అమెరికా మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. అమెరికా కోర్టు తన క్లయింట్‌ను నిరాపధిగా ప్రకటించిన అభియోగాలపైనే భారత్ విచారణ జరపనుండటం ఒకటైతే, విచారణ జరిపేందుకు అవసరమైన నేరాలకు పాల్పడినట్లు అక్కడి ప్రభుత్వం కారణాలను నిర్ధారించకపోవటం రెండోదని వాదించారు. అయితే ఈ రెండు వాదనలను తోసిపుచ్చిన కాలిఫోర్నియా జిల్లా కోర్టు రాణా పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో రాణాను భారత్‌కు అప్పగించేలా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదేశాలు జారీ చేసేందుకు మార్గం సుగమమైంది.
అయితే ఈ ఆదేశాలను సవాల్ చేసేందుకు రాణాకు ఇంకా అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రైటాఫ్ పిటిషన్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ రాణా నైన్త్ సర్క్యూట్ కోర్టులో అప్పీల్ చేశాడు. విచారణ పూర్తయ్యే వరకు భారత్‌కు అప్పగింతపై స్టే విధించాలని కోరాడు. ఈ అభ్యర్థనపై కోర్టు త్వరలో విచారణ జరపనుంది.