Operation Sindoor: జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసం..
80 మందికి పైగా ఉగ్రవాదులు హతం..!;
పహల్గాం బైసరన్‌లో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు భారత సైన్యం బుద్ధి చెప్పింది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపుదాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది.
జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్లతో ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. బహవల్‌పూర్ జైషే మహ్మద్, ముర్కిదేలోని లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపుల్లో 25 నుంచి 30 మంది చొప్పున టెర్రరిస్టులు హతమై ఉంటారని తెలిపారు. ముర్కిదే ప్రాంతం టెర్రర్ నర్సరీగా పేరుగాంచింది. ఎందుకంటే ఈ క్యాంపును 200 ఎకరాల్లో విస్తరించి, ఉగ్రవాద శిక్షణా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ముర్కిదే ఒక నర్వ్(నాడీ) సెంటర్‌గా పేరుగాంచింది. అయితే 80 నుంచి 90 మంది దాకా టెర్రరిస్టులు చనిపోయినట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు.
మసూద్ అజార్ ఉండే ప్రదేశాలే లక్ష్యంగా భారత ఆర్మీ మిస్సైల్ దాడులకు దిగింది. బహావల్‌పూర్‌లోని ఉగ్ర స్థావరంపై మొదటి దాడి చేసిన ఇండియా.. 30 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలపైనా క్షిపణులతో దాడులకు దిగింది. భారత్ మిస్సైల్ దాడులతో పాకిస్తాన్ బెంబేలెత్తి పోయింది. 6 చోట్ల దాడి చేసి 24 క్షిపణులను భారత్ ప్రయోగించిందని పాక్ ఆరోపించింది. ఈ దాడుల్లో సుమారు 8 మంది పాకిస్తాన్ ప్రజలు మృతి చెందగా 33 మందికి గాయపడినట్లు పాక్ ఆర్మీ అధికారి తెలిపారు.