India-UK Trade Deal: భారత్, బ్రిటన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం

భారతీయ రైతులు, మత్స్య పరిశ్రమకు మరింత లాభం..

Update: 2025-07-25 00:15 GMT

భారత్, యూకే మధ్య ‘‘స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)’’ కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు యుకె ప్రధాని కీర్ సమక్షంలో వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మరియు బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.

ఈ ఒప్పందం భారతదేశ రైతులకు ప్రయోజనం చేకూర్చబోతోంది. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు ఇప్పుడు బ్రిటిష్ మార్కెట్‌లో సుంకాలు ప్రవేశించే వెసులుబాటు దొరికింది. భారత రైతులు, యూరప్ దేశాల రైతుల కన్నా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు. పసుపు, మిరియాలు, యాలకుల వంటి భారతీయ ఉత్పత్తులు, మామిడి గుజ్జు, ఊరగాయలు, పప్పు ధాన్యాలు, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు కొత్త ఒప్పందం ప్రకారం సుంకాలు లేకుండా యూకే మార్కెట్‌లోకి వెళ్తాయి. ఇది రైతుల మార్కెట్ పరిధిని పెంచుతుంది. వారికి లాభాలను తీసుకువస్తుంది.

యూకే నుంచి వచ్చే దిగుమతులు కూడా విస్తారమైన భారతీయ మార్కెట్ లోకి ప్రవేశిస్తాయి. అయితే, సున్నితమైన భారత దేశ వ్యవసాయ రంగాన్ని బ్రిటిష్ దిగుమతుల నుంచి రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతోంది. దేశీయ రైతులపై ప్రభావం పడకుండా చూసుకోవడానికి పాల ఉత్పత్తులు, ఆపిల్స్, ఓట్స్,తినదగిన నూనెలపై ఎటువంటి సుంకం రాయితీలు ఉండవు.

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశ మత్స్య రంగానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ మరియు తమిళనాడు వంటి తీరప్రాంత రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. యూకేలో ప్రస్తుతం 4.2 శాతం నుంచి 8.5 శాతం వరకు రొయ్యలు, ట్యూనా, చేపలు, మాంసంపై సుంకాలు ఉన్నాయి. ఈ ట్రేడ్ డీల్ తర్వాత ఈ ఉత్పత్తులు ఎలాంటి సుంకం లేకుండా యూకే మార్కెట్‌లోకి వెళ్తాయి. తోలు, ఫుట్ వేర్, దుస్తుల ఎగుమతి కూడా సులభం అవుతుంది. యూకే నుంచి దిగుమతి చేసుకునే కార్లు, విస్కీ, వైద్య పరికరాలు భారతదేశానికి చౌక ధరలకు దొరుకుతాయి.

Tags:    

Similar News