Iran Vs Pak War: పాక్‌పై ఇరాన్ దాడికి స్పందించిన భారత్..
కీలక వ్యాఖ్యలు..ఉగ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టం;
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ముందు ముందు మరింత గడ్డు పరిస్థితులు ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం భారత్ మాత్రమే ఫిర్యాదు చేయగా...ఇప్పుడు పాకిస్థాన్‌కు పొరుగున ఉన్న అన్నిదేశాలు కూడా దాయాదిని వేలెత్తి చూపిస్తున్నాయి. పుల్వామా ఉగ్రవాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేయగా. తాజాగా ఆ జాబితాలో ఇరాన్ కూడా చేరింది. మంగళవారం బలూచిస్థాన్‌లోని మిలిటెంట్ల స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడటంపై భారత్ స్పందించింది. ఈ దాడులను ఇండియా పరోక్షంగా సమర్థించింది. ఇది పూర్తిగా ఇరాన్, పాకిస్థాన్‌ల అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు. ఆత్మరక్షణలో భాగంగా కొన్ని దేశాలు తీసుకునే చర్యలను తాము అర్థం చేసుకోగలమన్నారు విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్ జైస్వాల్. ఈ సందర్భంగా మరోసారి ఉగ్రవాదాన్ని వ్యతిరేకించారు. భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాద చర్యల్ని సహించబోదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎప్పటికీ రాజీ ఉండదని తేల్చి చెప్పారు. 2019 ఫిబ్రవరిలో కశ్మీర్‌లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
పాకిస్థాన్ ఉగ్రతండాలకు ఆశ్రయం కల్పించటంతోపాటు, ఉగ్రదాడులకు కుట్ర చేసే సంస్థలను ప్రోత్సహిస్తోందని చాలాకాలంగా భారత్ చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూరింది. భారత్ ఆరోపణలను దాయాదికి పొరుగున ఉన్న మిగితా దేశాలు కూడా బలపరుస్తున్నాయి. ప్రతీకార దాడులతో విరుచుకుపడుతున్నాయి. తమ దేశంలో ఉగ్రదాడులు, కార్యకలాపాలు సాగించే ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందటంపై అఫ్గాన్, చైనా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. తాజాగా ఇరాన్ కూడా పాక్‌లోని బలూచిస్థాన్‌లో ఉన్న ఉగ్ర తండాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. బలూచిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. జైష్ అల్ అదిల్ ఉగ్ర సంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినట్లు వెల్లడించింది. సున్నీ మిలిటెంట్ గ్రూపు అయిన జైషే అల్ అదిల్...పాక్ కేంద్రంగా స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఇరాన్‌లోని సిస్థాన్-బలూచిస్థాన్‌లో దాడులకు పాల్పడుతోంది. గతంలో పలుమార్లు ఇరాన్‌లో జరిగిన ఉగ్రదాడులకు జైషే అల్ అదిల్ మిలిటెంట్ గ్రూప్...బాధ్యత తీసుకుంది.