Kenya: కెన్యాలో ఉద్రిక్తతలు..భారతీయులకు కేంద్రం సూచనలు
హింసాత్మక ప్రాంతాలకు వెళ్లొద్దని సలహా..
ఆందోళనలతో ఆఫ్రికా దేశం కెన్యా అట్టుడుకుతోంది. పన్నుల పెంపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆ దేశంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. భద్రతా బలగాలు కాల్పుల్లో కనీసం ఐదుగురు నిరసనకారులు మరణించారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. ఇదిలా ఉంటే కెన్యాలోని పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మంగళవారం సూచించింది.
‘‘ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, అనవసరమైన కదలికలను నియంత్రించాలని మరియు పరిస్థితి సద్దుమణిగే వరకు నిరసనలు మరియు హింసాత్మక ప్రాంతాలను నివారించాలి’’ అని కెన్యాలోని భారత కాన్సులేట్ ఎక్స్‌లో సూచించింది. కెన్యాలో నివసిస్తున్న భారతీయ పౌరులు స్థానిక వార్తలు, ఇండియన్ మిషన్ వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అప్‌డేట్స్ ఫాలో కావాలని కాన్సులేట్ చెప్పింది.
అంతకుముందు మంగళవారం, కెన్యా పార్లమెంట్‌ని ముట్టడించేందుకు వస్తున్న ప్రదర్శనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కనీసం ఐదుగురు మరణించారు. పార్లమెంట్ భనవంలోని కొన్ని విభాగాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. రాజధాని నైరోబీలోని పార్లమెంట్ భవనం వెలుపల ఆందోళన భద్రతాబలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఈ ఆందోళనల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సవతి సోదరి ఔమా ఒబామా కూడా ఉన్నారు.