Iran: ఇరాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన గల్ఫ్ దేశాలు

ఓటింగ్ కి చైనా, రష్యా దూరం

Update: 2026-03-12 05:00 GMT

మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావం గల్ప్ ప్రాంతంలోని అనేక దేశాలపై పడుతోంది. సౌదీ అరేబియా నుంచి బహ్రెయిన్ వరకు పలు దేశాల్లో అమెరికాకు చెందిన ఎయిర్ బేస్‌లు, రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మిస్సైళ్లతో పాటు డ్రోన్ల ద్వారా బాంబు దాడులు జరుగుతున్నాయనే నివేదికలు వెలువడుతున్నాయి.

భద్రతామండలి అత్యవసర చర్చ

ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసరంగా స్పందించింది. గల్ప్ ప్రాంతంలో పెరుగుతున్న హింసను దృష్టిలో ఉంచుకుని భద్రతామండలి సమావేశమై ఇరాన్ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా 2817/2026 నంబర్‌తో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 15 మంది సభ్యులతో కూడిన భద్రతామండలిలో 13 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. చైనా, రష్యా మాత్రం ఓటింగ్‌కు హాజరు కాలేదు.

గల్ప్ దేశాలపై దాడులపై ఆందోళన

బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ వంటి దేశాలపై జరిగిన దాడులను భద్రతామండలి అత్యంత ఆందోళనకరంగా పేర్కొంది. ముఖ్యంగా పౌర ప్రాంతాలు, నివాస ప్రాంతాలపై దాడులు జరగడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని మండలి అభిప్రాయపడింది. వెంటనే ఇటువంటి చర్యలను నిలిపివేయాలని ఇరాన్‌ను కోరింది.

సముద్ర వాణిజ్యానికి అడ్డంకులు వద్దు

తీర్మానంలో మరో కీలక అంశంగా సముద్ర వాణిజ్యానికి ఆటంకాలు కలిగించే చర్యలను నిలిపివేయాలని కూడా సూచించారు. అలాగే ప్రాక్సీ గ్రూపులకు మద్దతు ఇవ్వడం, బెదిరింపులు చేయడం వంటి చర్యలను కూడా నిలిపివేయాలని మండలి హెచ్చరించింది. ఈ తీర్మానానికి భారత్‌తో సహా దాదాపు 135 దేశాలు సహప్రాయోజకులుగా నిలవడం విశేషంగా నిలిచింది.

అంతర్జాతీయ ప్రతిస్పందనలు

ఈ తీర్మానాన్ని బహ్రెయిన్ స్వాగతించింది. ఇరాన్ చర్యలను అంతర్జాతీయ సమాజం తిరస్కరిస్తోందని పేర్కొంది. డెన్మార్క్ ప్రతినిధులు కూడా ప్రాంతీయ దేశాల అభిప్రాయాలను గౌరవించడం అత్యవసరమని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ ప్రతినిధులు అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దాడులను వెంటనే నిలిపివేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News