Iran: రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం: ఇరాన్

ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన..;

Update: 2025-04-26 01:30 GMT

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ పాక్‌పై దౌత్యపరంగా కఠినంగా స్పందిస్తూ ‘‘సింధు జల ఒప్పందం’’ను రద్దు చేసింది. ఇకపై సింధు నది , దాని ఉపనదుల నుంచి పాకిస్తాన్‌కు నీరు వెళ్లకుండా చర్యలు చేపట్టింది. డ్యాముల గేట్లను మూసివేసి, నీటిని పూర్తిగా నియంత్రించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అదే సమయంలో, పాకిస్తాన్ భారత్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను రద్దు చేసింది. ఇందులో ప్రముఖమైన ‘‘సిమ్లా ఒప్పందం’’ కూడా ఉంది.

భారతీయ విమానాలకు తన గగనతలాన్ని మూసివేయడం ద్వారా మరో దూకుడు నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ, భారత్ , పాకిస్తాన్ తమకు సోదర దేశాలుగా అభివర్ణించారు. ఈ క్లిష్ట సమయంలో ఇరువురు పొరుగుదేశాల మధ్య సంభాషణకు వేదిక కల్పించేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉందని తెలిపారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో తమ మైత్రి కార్యాలయాల ద్వారా శాంతి, స్థిరత్వం కోసం మద్దతు ఇవ్వడానికి తాము రెడీగా ఉన్నామని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News