ప్రముఖ ఐరిష్ గాయకురాలు సినాడ్ ఓ'కానర్ మరణించారు. ఆమె సన్నిహితులు ఇచ్చిన సమాచారం మేరకు ఆమె 56 సంవత్సరాల వయస్సులో ఈ లోకాన్ని వీడారు. వినసొంపైన గొంతు, ఆత్మపరిశీలనకు ప్రేరేపించే సాహిత్యంతో 1987లో ఆమె తొలి ఆల్బమ్ 'ది లయన్ అండ్ ది కోబ్రా' విడుదలైంది. ఇక 1990 నాటి "నథింగ్ కంపేర్స్ 2 యు" పాటతో ప్రపంచవ్యాప్తంగా ఆమె అగ్రస్థానంలో నిలిచారు. ఆమె మరణ సందేశాన్ని తెలిపిన ఐరిష్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ RTE ఆమె కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపింది. సినాడ్ తన స్వచ్ఛమైన గాత్రం, అద్భుతమైన రచనాశైలితో విమర్శకుల ప్రశంసలను పొందింది. ఆమె రచనలే కాదు మాటలలో ఉండే పదును ఆమెను ఇతర కళాకారులనుంచి స్పష్టంగా వేరు చేసింది.
ఆమె తన పాటలలో మతం, సెక్స్, స్త్రీవాదం ఇలా చాలా అంశాలపై బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పేది. ఆమె ఒక "సాటర్డే నైట్ లైవ్"లో టెలివిజన్ ప్రదర్శనలో పోప్ జాన్ పాల్ II ఫోటోను చీల్చివేసినందుకు చాలా కాలం వరకు వార్తలలో నిలిచింది. తనను తాను ఒక నిరసన గాయకురాలిగా చెప్పుకొనే సినాడ్ తనకు కీర్తి కోసం ఆలోచనే లేదు అభిప్రాయాలు తెలుపడం తప్ప అని ప్రకటించారు. ఓ'కానర్ 2018లో ఇస్లాంలోకి మారి పేరును షుహదా సదాకత్‌గా మార్చుకున్నారు, అయినప్పటికీ సినెడ్ ఓ'కానర్ పేరుతో ప్రదర్శన కొనసాగించారు. ఓ కానర్ సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రేమించబడింది అంటూ ఐరిష్ ప్రధాన మంత్రి లియో వరద్కర్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ X లో పోస్ట్ చేసారు. ఆమె మృతికి సంతాపాన్ని ప్రకటించారు.