Israel attack: గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. 45 మంది పౌరులు మృతి
రఫా నగరంపై మళ్లీ దాడి చేసిన ఇజ్రాయెల్;
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ సేనలు మరోసారి దాడికి పాల్పడ్డాయి. హమాస్ మిలిటెంట్‌లతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గాజాకు దక్షిణ నగరమైన రఫాలోని పాలస్తీనియన్‌ల శరణార్థి శిబిరాలపై సేనలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 45 మంది పాలస్తీనియన్‌లు మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులు అల్ అహ్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 30 మృతదేహాలను తమ ఆస్పత్రికి తీసుకువచ్చారని, గాజా నగరానికి ఇది క్రూరమైన రోజు అని అల్-అహ్లీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హెడ్ ఫడేల్ నయీమ్ వ్యాఖ్యానించారు. తీర ప్రాంతంలోని రెండు ప్రదేశాల్లో బాంబు దాడుల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రఫాలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అహ్మద్ రద్వాన్ తెలిపారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన, గాయపడిన వారి వివరాలను గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం.. మువాసి పరిధిలో ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. పాలస్తీనియన్లకు ఇక్కడ రక్షణ శిబిరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ బలగాలు రెండుసార్లు దాడులకు తెగబడ్డాయని బాధితులు తెలిపారు. మరోవైపు తమ దేశ పౌరుల మరణాలకు ఉగ్రవాదులే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఉగ్రవాదులు జనం మధ్య తిరుగాడుతున్నారని, అందుకే ఈ దాడుల్లో పౌరులు కూడా మరణిస్తున్నారని ఇజ్రాయెల్ చెబుతోంది.