srael-Lebanon: హెజ్‌బొల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌..

150 లాంచర్ బ్యారెల్స్, ఆయుధాగారాలు, మౌలిక సదుపాయాలపై రాకెట్ల వర్షం;

Update: 2024-09-20 05:15 GMT

లెబనాన్‌ లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల   నేపథ్యంలో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌  దళాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్‌ వైమానిక దాడులకు దిగింది.

గురువారం మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు దాదాపు వంద రాకెట్‌ లాంఛర్లలో ఉన్న 1000 రాకెట్లను తమ యుద్ధ విమానాలతో ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్‌  వెల్లడించింది. ఈ రాకెట్లను ఇజ్రాయెల్‌ భూభాగంపై దాడి చేసేందుకు సిద్ధం చేయగా.. వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపింది. హెజ్‌బొల్లా  సభ్యులకు చెందిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఈ సంస్థ అధిపతి హసన్‌ నస్రల్లా నిన్న ప్రసంగించారు. ఆ సమయంలోనూ ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేయడం గమనార్హం.

ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణలతో దాదాపు ఏడాదికాలంగా పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇప్పుడు ఈ యుద్ధం లెబనాన్‌కూ విస్తరించనుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అమెరికా (USA) అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏడాది నుంచి తమ సైన్యాన్ని మోహరించిన అగ్రరాజ్యం.. తాజా పరిణామాలతో అలర్ట్‌ అయ్యింది. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్‌బొల్లా శపథం చేయడంతో యుద్ధ విమానాలు, నౌకలు, బలగాలతో సిద్ధమవుతోంది.

పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో అప్రమత్తమైన లెబనాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకుపోవడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. అటు ఖతర్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా దీనిపై ప్రకటన చేసింది. లెబనాన్‌ ఆదేశాలకు అనుగుణంగా బీరుట్‌ నుంచి రాకపోకలు సాగించే తమ విమానాల్లో పేజర్లు, వాకీటాకీలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది.

Tags:    

Similar News