Israel Hamas Conflict: హమాస్‌తో యుద్ధం ఈ ఏడాదంతా కొనసాగే అవకాశం
తగ్గేదే లేదంటున్న ఇజ్రాయెల్;
హమాస్‌తో యుద్ధం ఈ ఏడాది అంతా కొనసాగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ మేరకు బలగాల మోహరింపు విషయంలో..ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో కొంతమంది బలగాలకు..విశ్రాంతి ఇచ్చేందుకు వెనక్కు పిలుస్తున్నట్లు వివరించింది
గాజా నుంచి భారీ సంఖ్యలో బలగాలను వెనక్కు పిలుస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన మరుసటి రోజే భీకర యుద్ధం చోటుచేసుకుంది. గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ సైన్యంతో మిలిటెంట్ల పోరాటం కొనసాగుతోంది. దక్షిణగాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో హోరాహోరీ పోరు చోటుచేసుకుంది. గత 24 గంటల వ్యవధిలో యుద్ధం కారణంగా 207మంది పాలస్తీనావాసులు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. యుద్ధం కారణంగా ఇప్పటికే సుమారు 22వేల మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీవ్రమైంది. ఫలితంగా బలగాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించగా హమాస్ మిలిటెంట్లు సరిహద్దుల్లో దురాగతాలకు ప్రణాళికలు రచించినట్లుIDF బలగాలు గుర్తించాయి. సరిహద్దుల్లోని తీరప్రాంతాల్లో.. పెద్దఎత్తున బాంబులను అమరుస్తున్నట్లు వెల్లడించాయి. IDF బలగాలను లక్ష్యం చేసుకొని బాంబులు పేల్చేందుకు సిద్ధమవుతున్నట్లు వివరించాయి. ఫలితంగా ఇజ్రాయెల్ నౌకాదళం వాయుసేన, మిలిటరీ బలగాలు ఉగ్రవాదుల ఏరివేత చేపట్టాయి. ఈ క్రమంలో పెద్దసంఖ్యలో మిలిటెంట్లను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. హమాస్ నిల్వ ఉంచిన ఆయుధ గోదామును కూడా... గుర్తించినట్లు వెల్లడించింది. మరోవైపు హమాస్‌తో యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సంకేతాలిచ్చారు.
హమాస్ మిలిటెంట్లను తుడిచిపెట్టడం సహా గాజాలో హమాస్ పాలనా యంత్రాంగాన్ని నిర్మూలించేవరకూ యుద్ధం కొనసాగిస్తామని..ఆయన స్పష్టం చేశారు. బందీలుగా ఉన్న 100 మందికిపైగా ప్రజలను విడిపించేవరకూ.. పోరాటం కొనసాగుతుందన్నారు.మరోవైపు కొంతకాలంగా యుద్ధంలో ఉన్న బలగాలకు విశ్రాంతిని ఇచ్చేందుకే వెనక్కు పిలుస్తున్నట్లు....ఇజ్రాయెల్ సైన్యంతోపాటు అధికార ప్రతినిధి మార్క్ రెగెవ్ తెలిపారు. తర్వాత వారు...తిరిగి యుద్ధ రంగంలో దిగుతారని స్పష్టం చేశారు. ఈ ఏడాది అంతాయుద్ధం కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. హమాస్ అంతమే తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్ ప్రజలూ ఇదే కోరుకుంటున్నారని వివరించారు.