అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ దాడులు, 15 మంది మృతి

కాల్పుల విరమణను తిరస్కరించిన నెతన్యాహు;

Update: 2023-11-04 06:45 GMT

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది. పరస్పర దాడులతో రెండు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే రెండు వైపుల వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా హమాస్ అధీనంలోని గాజాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఓ అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 15 మంది చనిపోగా.. 60 మంది గాయపడ్డారు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం పాలస్తీనాలోని గాజాలో  రక్తపుటేరులు పారిస్తున్నది. ఇజ్రాయెల్‌ దాడులతో గాజా స్ట్రిప్‌లో అమాయక పౌరులు మరణిస్తున్నారు. గత నెల సెంట్రల్‌ గాజాలోని ఓ దవాఖానపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 500 మందికిపైగా మృతిచెందగా, మూడు రోజుల క్రితం జబాలియా శరణార్థి శిబిరంఉన్న అపార్ట్‌మెంటుపై జరిగిన వైమానిక దాడిలో 50 మందికిపైగా మృత్యువాతపడ్డారు. తాజాగా గాజాలోని ఓ స్కూల్‌పై మోర్టార్‌ షెల్స్‌తో ఇజ్రాయెల్‌ దాడి చేసిందని, దీంతో 20 మంది చనిపోయారని, డజన్ల కొద్ది గాయపడ్డారని హమాస్‌ నేతృత్వంలోని పాలస్తీనా ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర గాజాలోని అల్‌ సఫ్టవే ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్‌లో శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారని, ఆ పాఠశాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించిందని హమాస్‌ ఆరోపించింది.


కాగా గాజాలో పౌరులకు సహాయం అందించడానికి వీలుగా కాల్పుల విరమణను పాటించాలని యూఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ ను కోరారు. యూఎస్ కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. బందీలందరినీ విడుదల చేస్తేనే సైనిక చర్యకు విరామం ఇస్తామని నెతన్యాహు నొక్కి చెప్పారు. గాజాకు సహాయం అందించడానికి మానవతావాద విరామం గురించి చర్చించినట్లు చెప్పారు. 

హమాస్ బందీలందరినీ విడుదల చేసే వరకు సైనిక దాడి కొనసాగుతుందని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి వెలుపల అంబులెన్స్‌పై దాడి చేసింది. ‘‘మేం ఉత్తర గాజా ప్రాంతం యుద్ధ ప్రాంతమని నొక్కి చెబుతున్నాం. ఈ ప్రాంతంలోని పౌరులు తమ భద్రత కోసం దక్షిణం వైపునకు వెళ్లాలని పదేపదే పిలుపునిచ్చాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది. కాగా ఉగ్రవాద చర్యల కోసం హమాస్‌ అంబులెన్స్‌ను వినియోగించుకుంటోందన్న అదనపు సమాచారాన్ని ఇజ్రాయెల్ సైన్యం పంచుకుంది.

గాజాలోని అల్-షిఫా ఆసుపత్రికి దగ్గరగా ఉన్న రోగులను తరలించే అంబులెన్స్‌లపై దాడులు చేసిన ఘటన తెలిసి తాను షాక్ అయ్యానని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. సౌదీ, ఖతార్, ఎమిరాటీ, ఈజిప్టు విదేశాంగ మంత్రులతో పాటు పాలస్తీనా ప్రతినిధులను శనివారం అమ్మాన్‌లో అమెరికా స్టేట్ సెక్రటరీ బ్లింకెన్ కలుస్తారని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Tags:    

Similar News