Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు..జర్నలిస్టులు సహా 15 మంది మృతి
గాజా ఆస్పత్రిపై భారీ వైమానిక దాడి;
గాజాను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ ముందుకు దూసుకుపోతుంది. ఇందులో భాగంగా దాడులను ఉధృతం చేసింది. సోమవారం గాజా ఆస్పత్రిపై భారీ వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు జర్నలిస్టులు సహా 15 మంది మరణించారు. ఈ మేరకు గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన జర్నలిస్టుల్లో ఒకరు అల్ జజీరాకు చెందినవారు కాగా.. మరొకరు రాయిటర్స్‌కు చెందినవారని పేర్కొంది. నాసర్ ఆస్పత్రిలోని నాల్గవ అంతస్తుపై దాడి జరిగిందని.. రెస్క్యూ సిబ్బంది పైకి వెళ్లేలోపే రెండో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లుగా సమాచారం. తాము హమాస్ ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇక తాజా దాడిలో ఆస్పత్రి భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. గత వారం గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం తొలి అడుగులు వేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఓ వైపు కాల్పుల విరమణకు చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు వైమానిక దాడులతో గాజా దద్దరిల్లుతోంది.
అయితే గాజాను స్వాధీనం చేసుకోవడాన్ని అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాలు తెలిపాయి. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ప్రకటించాయి. ఇంకోవైపు ఐక్యరాజ్యసమితి కూడా ఇజ్రాయెల్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని కోరింది. అయినా కూడా ఇజ్రాయెల్ దూకుడుగానే వెళ్తోంది.