JAPAN: చంద్రుడిపై పరిశోధన రేసులో జపాన్
జాబిల్లిపై ల్యాండర్‌ను దింపనున్న జపాన్.... విశ్వంపై పరిశోధనలు చేసేందుకు ఎక్స్ రే టెలిస్కోపు;
చంద్రుడిపై తాజాగా పరిశోధన జరుపుతున్న దేశాల రేసులో జపాన్ కూడా చేరింది. జాబిల్లిపై చిన్న ల్యాండర్‌ను దించనుంది. ఈ మేరకు స్మార్ట్ ల్యాండర్‌తో పాటు విశ్వంపై పరిశోధనలు చేసే ఎక్స్ రే టెలిస్కోపును నింగిలోకి పంపింది. తనేగాషిమ అంతరిక్ష కేంద్రం నుంచి H2-A రాకెట్ ల్యాండర్ , టెలిస్కోపులను మోసుకుని రోదసీలోకి దూసుకెళ్లింది. ఎక్స్ రే ఇమేజింగ్, స్పెక్ట్రోస్కోపీ మిషన్‌గా పిలుస్తున్న ఉపగ్రహాన్ని రాకెట్ భూకక్ష్యలో ప్రవేశపెట్టనుంది. పాలపుంతల మధ్య వేగం, ఇతర రహస్యాలపై ఈ ఉపగ్రహం పరిశోధన చేయనుంది. విశ్వం ఎలా ఏర్పడిందనే రహస్యాన్ని కొనుగొనేందుకు ఈ ఉపగ్రహం ఇచ్చే సమాచారం ఉపకరిస్తుందని జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ-జాక్సా తెలిపింది. అదే రాకెట్ తేలికపాటి ల్యూనార్ ల్యాండర్ ను కూడా మోసుకెళుతోంది. వచ్చే ఏడాదిలో ఈ ల్యాండర్‌ను చంద్రుడిపైకి దించుతామని జాక్సా తెలిపింది. ఇప్పటివరకూ భారత్, అమెరికా, రష్యా, చైనా మాత్రమే తమ పరికరాలను విజయవంతంగా జాబిల్లిపై దించగలిగాయి. ఆ జాబితాలో చేరాలని జపాన్ తహతహలాడుతోంది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపి భారత్ చరిత్ర సృష్టించింది. ఆగస్టు 23న ఈ ఘనత సాధించి ప్రపంచాన్ని అబ్బురపరిచింది. విక్రమ్ ల్యాండర్‌ను దిగ్విజయంగా చంద్రుడిపైకి చేర్చింది. రోవర్ చంద్రుడిపై ఉన్న మట్టి, నీటిపై రసాయన పరిశోధన జరిపింది. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది అని పరిశోధించిన సమాచారాన్ని రోవర్ భూమికి చేరవేసింది. ఇస్రోలకు చంద్రుడి ఉపరితల ఫొటోలను పంపింది. ల్యాండింగ్ ఇమేజ్ కెమెరా ఈ ఫోటోను తీసిందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ లోని కొంత భాగం ఇందులో కనిపిస్తోంది. తొలి పరిశీలనకు సంబంధించిన ఫలితాలను ఇస్రో..గ్రాఫ్ రూపంలో ట్విట్టర్‌లో షేర్ చేసింది. చంద్రుడిపై నమోదవుతోన్న వివిధ రకాల ఉష్ణోగ్రతలను ఇస్రోకు చేరవేసింది ప్రగ్యాన్ రోవర్. ఉపరితలం నుంచి పది సెంటీమీటర్ల లోతు వరకు టెంపరేచర్లు అబ్జర్వ్ చేయగా.. అందుకు సంబంధించిన గ్రాఫ్‌ను విడుదల చేసింది ఇస్రో. 14 రోజులు చంద్రుడిపై తిరుగుతూ పరిశోధనలు చేసిన ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉంది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపి చరిత్ర సృష్టించిన ఆగస్టు 23(August 23 )ను అందరిక్ష విజ్ఞాన దినోత్సంవంగా ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి అని ప్రధాని పేరు పెట్టారు. ఇప్పుడు ప్రతి ఇంటిపైనే కాకుండా చంద్రుడిపైనా త్రివర్ణ పతాకం ఎగురుతోందని అన్నారు. మేకిన్ ఇండియా ఇప్పుడు చంద్రుడి వరకు సాగిందన్నారు.