Japanese Court : చేయని నేరానికి 55 ఏండ్ల జైలు

12 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం;

Update: 2025-03-26 01:00 GMT

 మరణశిక్షపై 55 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపి గత ఏడాది నిర్దోషిగా విడుదలైన ఓ జపాను వృద్ధుడికి 14 లక్షల డాలర్ల(దాదాపు రూ.12 కోట్లు) నష్ట పరిహారాన్ని న్యాయస్థానం ప్రకటించింది. తప్పుడు కేసులో అత్యంత సుదీర్ఘ కాలం జైలు జీవితాన్ని గడిపినందుకు రోజుకు 85 డాలర్లను (దాదాపు రూ.12,300) చొప్పున నష్ట పరిహారంగా అందచేయాలని షిఝువోకా జిల్లా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాజీ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ అయిన 89 ఏళ్ల ఇవావో హకమాటా 1968లో నలుగురు వ్యక్తుల హత్యకు సంబంధించిన కేసులో అరెస్టయ్యారు. అతనికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మృతుల వద్ద లభించిన రక్తపు మరకలు ఉన్న బట్టలను ప్రధాన సాక్ష్యంగా పరిగణించిన కోర్టు హకమాటాకు మరణశిక్ష విధించింది.

అయితే ఈ బట్టలను డీఎన్‌ఏ పరీక్షకు పంపగా వాటిని మృతదేహాల వద్ద పోలీసులే ఉంచారని బయటపడింది. దీంతో హకమాటా మరణశిక్షను కోర్టు రద్దు చేసింది. తప్పుడు కేసులో మరణశిక్షను ఎదుర్కొని అత్యంత సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని గడిపిన తొలి వ్యక్తిగా హకమాటా జపాను చరిత్రలో నిలిచిపోయారు. ఆయనకు కోర్టు ప్రకటించిన నష్టపరిహారం అతి పెద్ద మొత్తమని, అయితే ఆయన కోల్పోయిన జీవితాన్ని ఏదీ భర్తీ చేయలేదని హకమాటా తరఫు న్యాయవాది హిడెయో ఓగావా వర్ణించారు. 1961లో ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా రిటైర్‌ అయిన హకమాటాకు సెంట్రల్‌ జపాన్‌లోని షిఝువోకాలోని సోయాబీన్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో ఉద్యోగం లభించింది. రెండేళ్ల తర్వాత ఆయన యజమాని, యజమాని భార్య, వారి ఇద్దరు పిల్లలు వారి ఇంట్లో కత్తిపోట్లకు గురై మరణించారు. తన చేత పోలీసులే బలవంతంగా నేరాన్ని ఒప్పించారని ఇవావో హకమాటా వాదించాడు.

Tags:    

Similar News