Jeff Bezos:వివాహ బంధంతో ఒక్కటైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్

కిమ్ కర్దాషియన్, ఓప్రా విన్‌ఫ్రే వంటి హాలీవుడ్ ప్రముఖుల హాజరు;

Update: 2025-06-28 02:45 GMT

ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ప్రియురాలు, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం అట్టహాసంగా జరిగింది. 200 మంది అత్యంత ప్రముఖుల మధ్య ఇటలీలోని వెనిస్‌లో పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోను శుక్రవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో సాంచెజ్ పోస్ట్ చేశారు. ఆమె తెల్లటి లేస్ గౌను ధరించగా.. బెజోస్ క్లాసిక్ టక్సేడోలో కనిపించారు. ఇద్దరూ కూడా చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించారు.

ఈ వేడుక శాన్ జార్జియో మాగియోర్ అనే పచ్చని ద్వీపంలో జరిగింది. వెనీషియన్ సరస్సు మీదుగా డోగేస్ ప్యాలెస్‌ కనిపిస్తోంది. అత్యంత సన్నిహితులు.. ప్రియమైన అతిథులు దాదాపు 200 మంది మోటార్ బోట్ ద్వారా ప్రత్యక్షమయ్యారు.  మూడు రోజుల పాటు చాలా గ్రాండ్‌గా ఈ వివాహ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల కోసం బెజోస్, శాంచెజ్ గ్రాండ్ కెనాల్‌పై ఉన్న 16వ శతాబ్దపు విలాసవంతమైన అమన్ హోటల్‌లో బస చేశారు. కిమ్ కర్దాషియన్, ఓప్రా విన్‌ఫ్రే, ఓర్లాండో బ్లూమ్, అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ టామ్ బ్రాడీ, గాయకుడు ఉషర్, జోర్డాన్ రాణి రానియా, ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ వంటి ఎందరో ప్రముఖులు ప్రత్యేక బోట్లపై వేడుకలకు హాజరయ్యారు. పెళ్లి తర్వాత లారెన్ శాంచెజ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేరును 'లారెన్‌శాంచెజ్‌బెజోస్'‌గా మార్చుకుని, పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రముఖ ఒపెరా గాయకుడు ఆండ్రియా బోసెల్లి కుమారుడు మాటియో బోసెల్లి తన గానంతో నూతన వధూవరులను, అతిథులను అలరించారు. మిషెలిన్-స్టార్ చెఫ్ ఫాబ్రిజియో మెల్లినో పెళ్లి విందును సిద్ధం చేయగా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ పేస్ట్రీ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ కేక్‌ను తయారు చేశారు.

ఈ పెళ్లి వేడుకపై వెనిస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి నిరసనకారులు సెయింట్ మార్క్ టవర్‌పై "రాజులు వద్దు, బెజోస్ వద్దు" అని ఆకుపచ్చ నియాన్ లైట్లతో ప్రొజెక్ట్ చేశారు. "సంపన్నులపై పన్ను విధించండి" అంటూ కాలువల పక్కన ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ వేడుక కోసం దాదాపు 95 ప్రైవేట్ జెట్లు, మెగా యాట్‌లు నగరానికి రావడం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటకుల తాకిడితో ఇప్పటికే సతమతమవుతూ, నెమ్మదిగా కుంగిపోతున్న వెనిస్ నగరంపై ఇలాంటి వేడుకలు మరింత భారం మోపుతాయని వారు ఆరోపించారు

Tags:    

Similar News