Congress leader: బంగ్లాదేశ్ ప్రధాని పరిస్థితే గవర్నర్‌కి వస్తుంది..
కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు;
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై దర్యాప్తునకు ఆదేశించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ పార్టీ నేత తీవ్రంగా హెచ్చరించారు. కర్ణాటక గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ ‘‘బంగ్లాదేశ్’’ తరహా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేత ఇవాన్ డిసౌజా బెదిరించడం వివాదాస్పదంగా మారింది. ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్ విచారణకు ఆదేశించారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిసౌజా గవర్నర్‌ని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతులు, నాయకులు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించి, గవర్నర్‌కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు.
మంగళూరులో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు ఇవాన్ డిసౌజా మాట్లాడుతూ.. ‘‘గవర్నర్ తన ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే, బంగ్లాదేశ్ ప్రధాని పారిపోయినట్లు, గవర్నర్ కూడా పారిపోతారు. గవర్నర్ కార్యాలయం వద్ద తర్వాత నిరసన ఉంటుంది’’ అని అన్నారు. గవర్నర్ విచారణకు ఆదేశించడంపై సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆగస్టు 29 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టుని హైకోర్టు ఆదేశించింది.
ముడా స్కాములో మైసూర్ నగరాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి భార్య పార్వతికి చెందిన 3.16 ఎకరాలు అప్పగించింది. 50:50 ప్రకారం భూయజమానులు అప్పటించిన భూమిలో సగాన్ని డెవలప్ చేసి మిగతా సగాన్ని యజమానులు మార్కెట్ రేటుకి అమ్ముకోవడం, పరిహారం ఇవ్వడం స్కీములో భాగం. అయితే, సీఎం భార్యకి ఆమె ఇచ్చిన స్థలంలో కాకుండా నగరంలోని సంపన్న ప్రదేశాలైన విజయనగరంలో 14 ఖరీదైన స్థలాలను కేటాయించడంపై వివాదం నెలకొంది. ఇది పరిహారంగా పొందిన స్థలాలు అసలు భూమి కన్నా ఖరీదైనవని ఆర్టీఐ కార్యకర్తలు కేసు ఫైల్ చేశారు.