Kashyap Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్
ట్రంప్ మరో సంచలన నిర్ణయం..;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన కాష్ పటేల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కాష్ పటేల్ నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. ఎఫ్‌బీఐ తొమ్మిదవ డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను నియమిస్తూ ట్రంప్ అధికారికంగా సంతకం చేశారని అధ్యక్షుడి సహాయకుడు, వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొత్త ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకాన్ని వైట్ హౌస్ స్వాగతించినట్లు తెలిపారు. ట్రంప్ ఎజెండాను అమలు చేయడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించింది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పేరును ప్రకటించారు. అయితే ఇలాంటి పదవుల విషయంలో సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపై తీర్మానంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో కాష్ పటేల్‌కు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన నియామకం అధికారికంగా ఆమోదముద్ర పడింది. అయితే రిపబ్లికన్‌లకు మెజార్టీ ఉన్న సెనేట్‌లో కాష్ పటేల్ నియమాకంపై ఓటింగ్ చేపట్టారు. అయితే అనూహ్యంగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ విప్ ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇక ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా పటేల్ నియమాకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రెండు ఓట్ల తేడాతో పటేల్ నియామకానికి లైన్ క్లియర్ అయింది.
1980లో న్యాయార్క్‌లోని గుజరాతీ తల్లిదండ్రులకు కాష్ పటేల్ జన్మించారు. తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. లాంగ్ ఐలాండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు. రిచ్‌మండ్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలు పూర్తి చేశారు. యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుంచి ఇంటర్నేషనల్ లా అభ్యసించారు. గతంలో జాతీయ భద్రతా సలహాదారుగా, హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్‌కి సీనియర్ కౌన్సెల్‌గా కూడా పటేల్ పని చేశారు.
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియామకం తర్వాత కాష్ పటేల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘అమెరికా ప్రజలు గర్వించేలా ఎఫ్‌బీఐని తీర్చిదిద్దుతాను. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే వారి అంతు చూస్తాం. వారు ఈ గ్రహంలో ఏ మూలన ఉన్నా వెంటాడుతామని హెచ్చరించారు. డైరెక్టర్‌గా నా లక్ష్యం స్పష్టంగా ఉంది.’’ అని పటేల్ తెలిపారు.