Kamala Harris: కమలాహారిస్ చెవి పోగులపై ఆసక్తికర చర్చ..
హారిస్ ఇయర్ రింగ్స్‌లో సీక్రెట్ డివైస్!;
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతోన్న కమలా హారిస్-డొనాల్డ్ ట్రంప్ ల మధ్య జరిగిన సంవాదంలో ఆమె ధరించిన చెవిపోగులపై అందరి దృష్టిపడింది. అది ఓ సీక్రెట్ పరికరమని పేర్కొంటూ పలు కథనాలు వెలువడ్డాయి. దీనిపై తాజాగా ఆ సంస్థ స్పందించింది.
కమల ధరించిన చెవిపోగులు నోవా హెచ్1 ఆడియో ఇయర్‌రింగ్స్ మాదిరిగానే ఉన్నాయని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. దానిపై జర్మనీ స్టార్టప్ నోవా ఐస్‌బాక్ సౌండ్(బ్లూటూత్ ఇయర్‌రింగ్స్ కంపెనీ) మేనేజింగ్ డైరెక్టర్ మాల్టే ఐవర్సన్ స్పందించారు. ‘‘ఆమె వద్ద మా ఇయర్‌ఫోన్స్ ఉన్నాయో, లేదో స్పష్టత లేదు. అధ్యక్ష అభ్యర్థుల సంవాదం కోసం మేం ఏ ఉత్పత్తిని రూపొందించలేదు. అయితే ఆ తరహాలో ఉపయోగించేందుకు మా ఉత్పత్తులు అనుకూలంగా ఉంటాయి’’ అని వెల్లడించారు. అలాగే ట్రంప్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం దీంట్లో మేల్ వర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నాం. త్వరలో ట్రంప్ ప్రచారానికి అందించగలుగుతాం. అయితే ఇక్కడ రంగే కాస్త ఇబ్బందిగా మారేలా ఉంది’’ అని అన్నారు.
ప్రస్తుతానికి కమలపై వస్తోన్న ఆరోపణలకు ఎలాంటి ధ్రువీకరణ లేదు. మామూలుగా ఆమె ఎప్పుడూ ముత్యాలు పొదిగిన ఆభరణాలనే ధరిస్తుంటారు. ఆమె టిఫనీ సంస్థ రూపొందించిన చెవిపోగులను ధరించినట్లు తెలుస్తోంది. రెండు బంగారు కడ్డీలపై ముత్యం పొదిగినట్టుగా ఆ డిజైన్ ఉంది. కానీ నోవా హెచ్1 ఆడియో ఇయర్ రింగ్స్ డిజైన్ కాస్త వేరుగా ఉంటుందని అంతర్జాతీయ మీడియా కథనం ఒకటి పేర్కొంది.