Justin Trudeau: ట్రూడో సమక్షంలోనే ఖలిస్థాన్ నినాదాలు
టొరంటోలో ఖల్సా డే వేడుకల సందర్భంగా;
భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినేలా ఓ ఘటన చోటుచేసుకున్నది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రసంగిస్తుండగా.. కొందరు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. ఆదివారం టొరంటోలో ‘ఖల్సా డే’ వేడుకలు నిర్వహించారు. ఇందులో ప్రధాని ట్రూడోతోపాటు విపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ట్రూడో సమక్షంలో ఖలిస్థాన్ నినాదాల ఘటనపై న్యూఢిల్లీలోని కెనడా హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీచేసింది. ఈ పరిణామం ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, హింసను ప్రోత్సహించేలా ఉందని నిరసన వ్యక్తం చేసింది.
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘RAW’ అధికారి ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం నాడు న్యూస్ టెలికాస్ట్ చేసింది. ఆ అధికారి పేరును విక్రమ్ యాదవ్‌గా గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. అమెరికాలోని సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ అధికార ప్రతినిధి గురుపత్వంత్ సింగ్ ఖలిస్థానీల కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. భారత ప్రభుత్వం అతనిని ఉగ్రవాదిగా ప్రకటించడంతో.. అమెరికాలో ప్రాణాంతక ఆపరేషన్‌ను భారత గూఢచర్య సంస్థ నిర్వహించడంపై అగ్రరాజ్య అధికారులు మండిపడినట్లు ఆ కథనంలో పేర్కొంది.
అయితే, అమెరికా నిఘా విభాగాలు గురుపత్వంత్‌పై హత్యాయత్నాన్ని అడ్డుకున్నాయని ఈ సందర్భంగా వాష్టింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. ‘RAW’ ఉన్నతాధికారుల పర్మిషన్ తోనే విక్రమ్ యాదవ్ పన్నూపై ఈ హత్యాయత్నంలో వారి ప్రమేయం కూడా ఉందని అమెరికా నిఘా, గూఢచర్య వర్గాలు భావిస్తున్నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనంలో వెల్లడించింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి కూడా గురుపత్వంత్‌ను హతమార్చే పథకం గురించి తెలుసని.. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను అమెరికా సంస్థలు కొంతమేరకు గుర్తించినట్లు చెప్పుకొచ్చింది.
అలాగే, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్ కు ఈ విషయం తెలిసే ఛాన్స్ ఉన్నా.. అందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవని అమెరికా అధికారులను వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో తెలిపింది. విదేశాల్లోని తమ శత్రువులను నిర్మూలించేందుకు కొన్ని దేశాల ప్రభుత్వాలు వివిధ చర్యలకు పాల్పడుతున్నాయి.. వాటిపై పరిశోధనల క్రమంలోనే గురుపత్వంత్ సింగ్‌పై హత్యాయత్నం వివరాలను, ఆధారాలను సేకరించే ప్రయత్నం జరిగిందని అమెరికన్ బిలియనీర్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఈ విషయాన్ని పేర్కొనింది.