Khalistani Terrorist: గురుపత్వంత్ సింగ్ పన్నున్‌పై ఎన్ఐఏ సంచలన నివేదిక..
భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, ఎన్నో దేశాలు ఏర్పాటు చేయాలని...;
కెనడాలో ఉంటున్న హిందువులు భారత్‌కు వెళ్లిపోవాలని హెచ్చరించిన ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎన్నో కుట్రలు పన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ గుర్తించింది. పన్నూ... భారత్‌ను విభజించి అనేక దేశాలు సృష్టించాలని కోరుకుంటున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నివేదిక తెలిపింది. నిషేధిత వేర్పాటువాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్' అధినేత.. గురుపత్వంత్ సింగ్ పన్నూకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. భారత్‌ను విభజించి అనేక దేశాలు సృష్టించాలని.. ఈ ఖలిస్థాన్ ఉగ్రవాది కోరుకుంటున్నట్లు.. NIA దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
కెనడాలో ఉంటున్న హిందువులు భారత్‌కు వెళ్లిపోవాలంటూ ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల హెచ్చరికలు జారీ చేశాడు. అక్కడున్న హిందూ కెనడియన్లు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో గట్టి చర్యలకు ఉపక్రమించిన భారత్, పంజాబ్, చండీగఢ్‌లోని పన్నూ ఆస్తులను జప్తు చేసింది. అటువంటి ఉగ్రవాది భారత్‌ను విభజించి అనేక దేశాలు సృష్టించాలని కోరుకుంటున్నట్లు NIAదర్యాప్తులో తేలినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారతదేశ ఐక్యత, సమగ్రతను సవాలు చేస్తూ పన్నూ ఆడియో మెసేజ్‌లు విడుదల చేసినట్లు వెల్లడైంది. దేశాన్ని మతపరంగా విభజించి ఓ వర్గానికి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని అతను కోరుకుంటున్నట్లు దర్యాప్తులో తేలినట్లు జాతీయ మీడియా పేర్కొంది. పంజాబ్‌తోపాటు దేశవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతోపాటు ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న. గురుపత్వంత్ సింగ్ పన్నూను NIA 2019లో మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది.
ప్రత్యేక ఖలిస్థాన్ కోసం పోరాడటంతో పాటు ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొనేలా యువతను ప్రేరేపిస్తున్నట్లు NIA దర్యాప్తులో తేలింది. దీంతో అదే ఏడాది సిఖ్స్ ఫర్ జస్టిస్‌ను NIA నిషేధించింది. తర్వాత 2022లో పన్నూను కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది.అయితే అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఇంటర్‌పోల్ రెండుసార్లు తిరస్కరించింది. తాజాగా కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కెనడాలోని హిందువులపై మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న NIAపన్నూతోపాటు వివిధ దేశాల్లో నివసిస్తోన్న మరో 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీటితోపాటు వివిధ దేశాల్లో ఉన్న ఖలిస్థానీ ఉగ్రవాదులను గుర్తించి.. వారి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును రద్దు చేయాలని ఆయా విభాగాలకు ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. తద్వారా వారు మళ్లీ భారత్‌లో అడుగుపెట్టకుండా అడ్డుకోవచ్చనేది భారత్ అభిప్రాయంగా జాతీయ కథనాలు పేర్కొన్నాయి.