Pakistan-Afghan: ఈసారి చర్చలు విఫలమైతే ఇక యుద్ధమే.. తాలిబన్లకు పాక్ వార్నింగ్
ఈరోజు మరోసారి పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య చర్చలు
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య గురువారం మరొకసారి శాంతి చర్చలు జరగనున్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్‌లో చివరి విడత చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పలు మార్లు రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి గానీ చర్చలు విఫలమైతే మాత్రం యుద్ధమేనని ప్రకటించారు. తమ ఎదుట చాలా ఆప్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
చర్చలు ప్రారంభం కాకముందే జియో టీవీలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ యుద్ధం బెదిరింపులు చేశారు. కాబూల్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని.. సరిహద్దు దాడులను చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్ పౌరులపై డ్రోన్ యుద్ధానికి దిగుతోందని పేర్కొన్నారు. తాలిబన్లు ఎదుర్కోవడానికి ఏకైక మార్గం యుద్ధమేనని ప్రకటించారు. అయితే ఖవాజా ఆరోపణలను ఆప్ఘనిస్థాన్ తీవ్రంగా ఖండించింది.
ఇటీవల ఖతార్‌లోని దోహాలో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ చర్చలు ఫలించలేదు. రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు ఉద్రిక్తతలకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం. దీంతో చర్చలు కొలిక్కి రాలేదు. ఆ సమయంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అండగా చూసుకుని కాబూల్ రెచ్చిపోతుందని.. తమ జోలికి వస్తే 50 రెట్ల ప్రతిదాడులు ఉంటాయని హెచ్చరించారు. తాజాగా మరోసారి చర్చలకు ముందే.. విఫలమైతే యుద్ధమేనంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నేటి చర్చలు ఎలా ముగుస్తాయో చూడాలి.