Pakistan: బొమ్మ అనుకొని “మోర్టార్ షెల్”తో ఆట, పేలుడుతో ఐదుగురు మృతి..
పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో విషాదం..;
పాకిస్తాన్‌లో అనుకోని ప్రమాదం జరిగింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా(కేపీకే) ప్రావిన్సులో ‘‘మోర్టార్ షెల్’’ పేలుడుతో ఐదుగురు పిల్లలు మరణించారు. మరో 13 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. లక్కీ మార్వాట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నలుగురు బాలికలు ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పిల్లలు మోర్టార్ షెల్‌ని బొమ్మగా భావించి ఆడుకుంటుండగా ఈ పేలుడు సంభవించింది. పిల్లలు పొలాల్లో పాత మోర్టార్ RPG-7 షెల్‌ను కనుగొన్నారు. దానిని ఇంటికి తీసుకువచ్చి ఆడుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో షెల్ ఒక్కసారిగా పేలింది. గాయపడిన పిల్లలు, మహిళలు ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీస్ అధికారి అమిర్ ఖాన్ చెప్పారు.