Pahalgam attack : పెహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కమాండర్

గుర్తించిన ఎన్‌ఐఏ;

Update: 2025-04-30 06:30 GMT

పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేయడానికి కశ్మీర్‌ నుంచి పారిపోయి పాక్‌లో స్థిరపడిన ఓ ఉగ్రవాది నెట్‌వర్క్‌ సాయపడినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. లష్కరే తోయిబాకు చెందిన కమాండర్‌ ఫరూఖ్‌ అహ్మద్‌ తేడ్వా కూడా ఈ దాడిలో కీలకపాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. ఇటీవలే భద్రతా దళాలు కుప్వారాలో అతడి ఇంటిని పేల్చివేశాయి. గత రెండేళ్లలో కశ్మీర్‌లో చాలా ఉగ్రదాడులకు అతడు సాయం చేసినట్లు గుర్తించారు.

ఫరూఖ్‌కు కశ్మీర్‌లోని పర్వతాలు, లోయల్లో మార్గాలపై పట్టు ఉంది. అతడే మూడు మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సాయం చేశాడు. ఇతడికి పాక్‌లో కూడా బలమైన సంబంధాలున్నాయి. 1990-2016 మధ్య ఇరుదేశాలకు పలుమార్లు ప్రయాణించాడు. పహల్గాంలోని ఉగ్రదాడి తర్వాత అతడికి సాయం చేసిన పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం పాక్‌లో స్థిరపడిన ఫరూఖ్‌.. కశ్మీర్‌లోని తన నెట్‌వర్క్‌తో సంబంధాలు పెట్టుకొనేందుకు సెక్యూర్డ్‌ కమ్యూనికేషన్‌ యాప్స్‌ను వినియోగిస్తున్నాడు.

దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సాధారణంగా ట్రెక్కింగ్‌కు పర్వతారోహకులు వినియోగించే ఆల్పైన్‌ క్వెస్ట్‌ వంటి నేవిగేషన్‌ యాప్‌ను ఆఫ్‌లైన్‌ మోడ్‌లో వినియోగించినట్లు భావిస్తున్నారు. దీంతో ఉగ్రవాదులను గుర్తించడం కష్టంగా మారింది.

దీనికితోడు ఉగ్రవాదుల వద్ద అల్ట్రాసెట్లు ఉన్నట్లు గుర్తించారు. 2023 నుంచి కశ్మీర్‌ లోయలో ముష్కరులు వీటిని వాడుతున్నారు. ఇవి సాధారణంగా జీఎస్‌ఎం, సీడీఎంఏ ఫోన్లలా పనిచేయవు. వీటిని ఫోన్లకు కూడా అనుసంధానించి.. ప్రత్యేకమైన రేడియో నెట్‌వర్క్‌ ద్వారా ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలను పంపించవచ్చు. గతంలో కేవలం మెసేజ్‌లు మాత్రమే వెళ్లేవి.. ఇప్పుడు వీటిద్వారా చిన్నచిన్న వాయిస్‌నోట్‌లు, వీడియోలు పంపించవచ్చు. ఒకవేళ అల్ట్రాసెట్‌ సిగ్నల్‌ను పసిగట్టినా.. అది కచ్చితమైన ప్రదేశం చూపించదు.. దీంతో దాదాపు 5-10 కిలోమీటర్ల వ్యాసార్థంలో గాలింపు చర్యలు చేపట్టాల్సిఉంది. పహల్గాం దాడి తర్వాత కూడా ఇలా సిగ్నల్స్‌ను పసిగట్టినా.. కచ్చితమైన ప్రదేశాన్ని మాత్రం గుర్తించలేదు.

Tags:    

Similar News