Libya Army Chief : తుర్కియేలో కూలిన ప్రైవేట్ జెట్.. లిబియా ఆర్మీ చీఫ్ మృతి

ఆర్మీ చీఫ్‌తో పాటు 8 మంది దుర్మరణం

Update: 2025-12-24 01:30 GMT

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లిబియా ఆర్మీ చీఫ్ అలీ కన్నుమూశారు. లిబియా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహమ్మద్ అలీ మరణవార్తపై ప్రధాన మంత్రి అబ్దుల్‌హమీద్ ద్బీబా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చాలా బాధ కలిగిందని ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. టర్కీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా పేర్కొంది. లిబియాకు గొప్ప నష్టంగా అభివర్ణించారు. ఆర్మీ చీఫ్‌తో పాటు నలుగురు అధికారులు చనిపోయినట్లు ధృవీకరించారు.

లిబియా సైనికాధికారి, మరో నలుగురు అధికారులు, ముగ్గురు సిబ్బంది ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ జెట్ విమానం మంగళవారం టర్కీ రాజధాని అంకారా నుంయి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే విమానంలోని సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని లిబియా అధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉన్నత స్థాయి రక్షణ చర్చల కోసం లిబియా ప్రతినిధి బృందం అంకారాలో ఉందని టర్కిష్ అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో మరణించిన మరో నలుగురు అధికారులు… లిబియా గ్రౌండ్ ఫోర్సెస్ అధిపతి జనరల్ అల్-ఫితౌరి గ్రైబిల్, మిలిటరీ తయారీ అథారిటీకి నాయకత్వం వహించిన బ్రిగేడియర్ జనరల్ మహమూద్ అల్-ఖతావి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సలహాదారు మొహమ్మద్ అల్-అసవి డియాబ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయంలో మిలిటరీ ఫోటోగ్రాఫర్ మొహమ్మద్ ఒమర్ అహ్మద్ మహజౌబ్ ఉన్నారు.

అంకారాకు దక్షిణంగా 70 కిలోమీటర్లు (సుమారు 43.5 మైళ్ళు) దూరంలో ఉన్న హేమానా జిల్లాలోని కేసిక్కావాక్ గ్రామం సమీపంలో ఫాల్కన్ 50 రకం బిజినెస్ జెట్ శిథిలాలు కనుగొనబడినట్లు టర్కిష్ అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం అంకారాలోని ఎసెన్‌బోగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత లిబియాకు తిరిగి వెళ్తున్న క్రమంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయని టర్కీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వెల్లడించారు. రాత్రి 8:30 గంటలకు విమానం టేకాఫ్ అయి 40 నిమిషాల తర్వాత సంబంధాలు తెగిపోయాయని టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. అన్ని కమ్యూనికేషన్లు ఆగిపోయే ముందు విమానం హేమానా సమీపంలో అత్యవసర ల్యాండింగ్ సిగ్నల్ జారీ చేసిందని యెర్లికాయ చెప్పారు.

అత్యవసర ల్యాండింగ్ కోసం కిందకు దిగుతున్నప్పుడు విమానం రాడార్ నుంచి అదృశ్యమైందని టర్కిష్ అధ్యక్ష కమ్యూనికేషన్స్ కార్యాలయ అధిపతి బుర్హానెట్టిన్ డ్యూరాన్ పేర్కొన్నారు. విమానం విద్యుత్ లోపం గురించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేసి అత్యవసర ల్యాండింగ్‌ను అభ్యర్థించిందని చెప్పారు. విమానాన్ని ఎసెన్‌బోగాకు తిరిగి మళ్లించారు. ఇంతలోనే ఎమర్జెనీ ల్యాండింగ్‌కు సన్నాహాలు జరిగిపోయాయన్నారు.

ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి నలుగురు ప్రాసిక్యూటర్లను నియమించినట్లు టర్కీ న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. టర్కిష్ అధికారులతో కలిసి పనిచేయడానికి లిబియా కూడా ఒక బృందాన్ని అంకారాకు పంపుతుంది.

Tags:    

Similar News