Lok Sabha elections: మూడో దశలో 61 శాతానికి పైగా పోలింగ్

బంగాల్​లో ఉద్రిక్త పరిస్థితులు

Update: 2024-05-08 00:00 GMT

పశ్చిమ బెంగాల్‌లో చెదురుమదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పలు చోట్ల ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కేంద్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 60.19 శాతం పోలింగ్ నమోదైంది. అసోంలో అత్యధికంగా 74.86, మహారాష్ట్రలో అత్యల్పంగా 53.63 శాతం ఓటింగ్ నమోదైంది. 1,351 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ ముగిసింది. పలుచోట్ల ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మహిళలు, వృద్ధులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్ సభ స్థానాల్లో..... సూరత్ సీటు భాజపాకు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 25 సీట్లకు ఓటింగ్ జరిగింది. గుజరాత్ లో 4.97 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 50 వేల 788 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి పోటీపడ్డారు.

కర్ణాటకలో మిగిలిన 14 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ 14 స్థానాల్లో 227మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మహారాష్ట్రలో 11 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ మందకొడిగా జరిగింది. 258 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అందరికళ్లూ పవార్ కుటుంబాలకు ప్రతిష్టాత్మకమైన బారామతి స్థానంపైనే ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పది స్థానాలకు మూడో విడతలో పోలింగ్‌ ముగిసింది. ఇక్కడ 100 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ విడతలో ములాయం కుటుంబ సభ్యులు బరిలో ఉండడంతో అత్యంత ఆసక్తి నెలకొంది.

మధ్యప్రదేశ్‌లోని 9 స్థానాలకు ఈ విడతలో పోలింగ్ ముగిసింది. బేతుల్ లోక్ సభ స్థానానికి రెండో విడతలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ...... అక్కడ BSP అభ్యర్థి మరణంతో ఈ విడతలో పోలింగ్ నిర్వహించారు. 127 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ, దమణ్‌ దీవ్‌ 2 స్థానాల్లో పోలింగ్‌ ముగిసింది.

మూడో విడత లోక్ సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ లో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముర్షిదాబాద్ లోక్ సభ స్థానానికి పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే రాణినగర్ లో ఓ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన నకిలీ ఏజెంట్ ను CPM అభ్యర్థి మహ్మద్ సలీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హరిహరపరాలోని కాంగ్రెస్ ప్రాంతీయ అధ్యక్షుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాంబు దాడి వెనక తృణమూల్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారనీ... ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకే అధికార పార్టీ ఈ దుశ్చర్యకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. జంగీపూర్ లోక్ సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.

Tags:    

Similar News