Mercury to Gold: పాదరసంతో బంగారం తయారీ..

అమెరికన్ స్టార్టప్ కంపెనీ సంచలనం;

Update: 2025-07-30 02:45 GMT

బంగారం అలంకరణ కోసం మాత్రమే కాదు.. పెట్టుబడిదారులకు మొదటి ప్రాధాన్యతగా మారింది. దీనికి గల కారణం గోల్డ్ ధరల పెరుగుదల. ఇదే సమయంలో సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పసిడి ధరలు తగ్గుతే బావుండు అని ఆలోచించే వారు లేకపోలేదు. ఇలాంటి వారికి బిగ్ రిలీఫ్ ఇవ్వబోతోంది ఓ అమెరికన్ స్టార్టప్ కంపెనీ. పాదరసాన్ని బంగారంగా మార్చడానికి ఒక మార్గాన్ని కనుగొన్నట్లు ఓ అమెరికన్ స్టార్టప్ పేర్కొంది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మారథాన్ ఫ్యూజన్ అణు సంలీన ప్రక్రియ ద్వారా పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయవచ్చని తెలిపింది. స్టార్టప్ ప్రకారం, బంగారం తయారీ ఫ్యూజన్ ప్లాంట్ ఒక గిగావాట్ థర్మల్ పవర్‌కు ఒక సంవత్సరంలో ఐదు వేల కిలోగ్రాముల బంగారాన్ని ఉత్పత్తి చేయగలదని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా శక్తి ఉత్పత్తి పై పరిశోధనలు కొనసాగిస్తున్న వేళ, మారథాన్ ఫ్యూజన్ అనే పరిశోధనా సంస్థ ఒక అద్భుతమైన ప్రయోగాన్ని ప్రకటించింది. ఈ ప్రయోగం ప్రకారం, వారు మెర్క్యురీ నుంచి బంగారాన్ని సృష్టించే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను విజయవంతంగా పరీక్షించారని చెబుతున్నారు. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది రెండు తేలికపాటి అణు గుళికలు కలిపి ఒక కొత్త, భారీ అణువుగా మారే ప్రక్రియ. ఈ ప్రక్రియలో అపారమైన శక్తి విడుదల అవుతుంది. మారథాన్ ఫ్యూజన్ ప్రకారం, వారు ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యూజన్ రియాక్టర్‌లో మెర్క్యురీ ఐసోటోప్స్‌ను ఉపయోగించి వాటిని బంగారం ఐసోటోప్స్‌గా మారుస్తున్నారు.

సూత్రప్రాయంగా, మెర్క్యురీ నుంచి బంగారం ఉత్పత్తి చేయడం సాధ్యమే. ఎందుకంటే రెండు మూలకాలు పిరియాడిక్ టేబుల్ లో దగ్గరగా ఉంటాయి. కానీ ఇది సాధారణ రసాయనిక పద్ధతులతో సాధ్యం కాదు. ఇది కేవలం అణు స్థాయిలోనే సాధ్యపడుతుంది. మారథాన్ ఫ్యూజన్ ప్రకారం, వారి ప్రయోగం ప్రాథమిక స్థాయిలో విజయవంతమైందని, కానీ ఇది వాణిజ్యపరంగా ఉపయోగపడటానికి ఇంకా చాలా పరిశోధనలు అవసరమని చెబుతున్నారు. 

ఈ పరిశోధన నిజమని రుజువైతే, భవిష్యత్తులో బంగారం ఉత్పత్తి విధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవచ్చు. అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు, ఈ ప్రక్రియ చాలా ఖరీదైనదే కాకుండా అధిక శక్తి వినియోగం అవసరం అవుతుంది. కాబట్టి ఇది తక్షణం ఆర్థికంగా లాభదాయకం అవుతుందా అన్నది సందేహాస్పదమే. మారథాన్ ఫ్యూజన్ చేసిన ఈ ప్రయోగం శాస్త్రీయ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తించింది. మెర్క్యురీ నుంచి బంగారం ఉత్పత్తి చేయడం ఇప్పటివరకు కేవలం సైన్స్ ఫిక్షన్‌లలో మాత్రమే కనిపించేది. ఇప్పుడు ఇది వాస్తవానికి దగ్గర కావడం న్యూక్లియర్ సైన్స్‌లో ఒక గొప్ప మైలురాయిగా భావిస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా, మారథాన్ ఫ్యూజన్ సమర్థవంతమైన న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడానికి దాదాపు $6 మిలియన్ల పెట్టుబడులను, $4 మిలియన్ల ప్రభుత్వ గ్రాంట్లను సేకరించింది. అయితే, వాణిజ్య ఫ్యూజన్ రియాక్టర్‌లను అభివృద్ధి చేసే వరకు, పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయాలనే కల కలగానే మిగిలిపోవచ్చు.

Tags:    

Similar News