ఇరాన్‌లోని అత్యాధునిక షాహిద్ రజాయీ నౌకాశ్రయంలో శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనలో ఐదుగురు మరణించగా, సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు వల్ల పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఘటన జరిగిన పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నాలుగు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను పంపించినట్లు హెర్మోజ్గాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ చీఫ్ మొక్తార్ సలాహ్‌షౌర్ చెప్పారు. చాలా కంటెయినర్లు పేలడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని హార్మొజ్గాన్ ప్రావిన్స్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ అథారిటీ చీఫ్ మెహ్‌ద్రద్ హస్సన్ జడేహ్ చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని దవాఖానలకు తరలించినట్లు తెలిపారు.
పేలుడు తర్వాత దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. ఘటనా స్థలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. పేలుడు ధాటికి ఓ భవనం కూలిపోయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డారు.
రజాయి పోర్టులో ప్రధానంగా కంటైనర్ల కార్యకలాపాలు జరుగుతాయి. ఏటా 80 మిలియన్ టన్నుల సరకు ఎగుమతి, దిగుమతి అవుతుంది. స్థానికంగా చమురు ట్యాంకులు, పెట్రోకెమికల్ సౌకర్యాలు ఉన్నాయి. ఒమన్‌లో ఇరాన్, అమెరికా మధ్య మూడవ రౌండ్ అణు చర్చలు ప్రారంభమైన సమయంలోనే ఈ పేలుడు సంభవించడం కలకలం రేపింది. ది జెరూసలేం పోస్ట్ ప్రకారం, ఈ పేలుడు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికా స్థావరం సమీపంలో సంభవించింది. ఈ పేలుడులో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించింది.