israel :తెగిన తలను అతికించిన డాక్టర్లు
అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన ఇజ్రాయిల్ వైద్యులు;
ఇజ్రాయిల్ వైద్యులు అద్భుతం సృష్టించారు. ప్రపంచంలోనే అసాధారణ, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించారు. కారుప్రమాదంలో తెగిపోయిన బాలుడి తలను అతికించారు. ఈ సంఘటన గత నెలలో జరగగా బాలుడు పూర్తిగా కోలుకున్నాక గాని ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని ఉద్దేశ్యంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇప్పుడు పిల్లాడు తన పనులు తాను చేసుకొనే స్థితికి రావడంతో పిల్లాడితో పాటు తీసుకున్న ఫోటోను, కేసు వివరాలను మీడియాకి విడుదల చేశారు.
నిజంగానే వైద్య రంగంలోనే అద్భుతం చోటుచేసుకొన్నది. 12 ఏళ్ల సులేమాన్ హాసన్ సైకిల్ తొక్కుతుండగా ఓ కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడి తలభాగం మెడ నుండి వేరయింది. వెన్ను భాగానికి పుర్రె వేలాడుతూ ఉంది. దీన్ని మెడికల్ భాషలో ‘బైలేటరల్ అట్లాంటో ఆక్సీపిటల్ జాయింట్ డిస్‌లొకేషన్' అని పిలుస్తారు.
వెంటనే బాలుడిని కుటుంబ సభ్యులు విమానంలో హదస్సా మెడికల్ సెంటర్‌కు తరలించారు. ఆ బాలుడు 50 శాతం మాత్రమే బతికే చాన్స్ ఉందని చెప్పిన వైద్యులు ఈ కేసును ఒక సవాల్‌గా స్వీకరించారు.బ్రతుకుతాడో లేదో తెలియని పరిస్థితుల్లోనే సర్జరీ ప్రారంభించారు. డాక్టర్ ఓహాద్ ఇనావ్ పర్యవేక్షణలో వైద్య బృందం, కొన్ని గంటలపాటు శ్రమపడి అతి క్లిష్టమైన శస్త్ర చికిత్స చేశారు. విజయవంతంగా హసన్ తల, వెన్నెముకను అతికించారు. ఈ చికిత్స జూన్‌లో జరగ్గా వివరాలను ఈ నెలలో వెల్లడించారు. హసన్ ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.
ఎప్పటిలాగే తన పనులు తాను చేసుకుంటున్నాడు. అంతటి మేజర్ సర్జరీ అయినా కూడా ఎవ్వరి సాయం లేకుండా నడవగలుగుతున్నాడు. అతడి శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలూ, శరీర భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని డాక్టర్స్ చెప్పారు. ఇంకా కొంత కాలం పాటుగా అతడి ఆరోగ్య పరిస్థితిని తరుచూ పర్యవేక్షిస్తుంటామని వారు తెలిపారు. బాలుడిని డిశ్చార్జి చేసే రోజున డాక్టర్లు ఆ బాలుడితో ఫోటో తీసుకుని విషయాన్ని వివరించారు.