PM Modi Special Gifts: జపాన్ ప్రధానికి మోడీ ఇచ్చిన ప్రత్యేక బహుమతి ఇదే

ప్రధానికి చాప్ స్టిక్‌లతో కూడిన రామెన్ గిన్నె, ఆయన భార్యకు పాష్మినా శాలువాను

Update: 2025-08-31 02:15 GMT

 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశం – జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రెండు రోజుల పర్యటన నిమిత్తం టోక్యో వెళ్లారు. జపాన్‌లో పర్యటన ముగించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా దంపతులకు ప్రత్యేక బహుమతులను అందజేశారు. జపాన్ ప్రధానికి చాప్ స్టిక్‌లతో కూడిన రామెన్ గిన్నెను, ఆయన భార్యకు పాష్మినా శాలువాను బహుమతిగా అందజేశారు.

ఏంటి ఈ బహుమతుల ప్రత్యేకతలు..

షిగేరు ఇషిబాకు అందజేసిన పాతకాలపు గిన్నెసెట్ భారతీయ చేతిపనులు, జపనీస్ సంప్రదాయంతో కూడిన ప్రత్యేకమైన సమ్మేళనంగా తయారు చేయబడింది. ఇది నాలుగు చిన్న గిన్నెలు, వెండి చాప్‌స్టిక్‌లతో అలంకరించి ఉంది. ఈ డిజైన్ జపాన్ సాంప్రదాయ డాన్బురి, సోబా ఆచారాల నుంచి ప్రేరణ పొంది రూపొందించారు. ఈ బహుమతి రూపకల్పనలో ఉపయోగించిన చంద్రుని రాయి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నారు. గిన్నె బేస్ రాజస్థాన్‌లోని ప్రసిద్ధి చెందిన మక్రానా పాలరాయితో తయారు చేశారు. సాంప్రదాయ పార్చిన్ కారి శైలిలో సెమీ-విలువైన రాళ్లతో ఈ రామెన్ గిన్నెను అలంకరించారు.

జపాన్ ప్రధాన మంత్రి భార్యకు కూడా భారత ప్రధాన మంత్రి బహుమతి అందజేశారు. ఆమెకు పేపర్ మాచే బాక్స్‌లో పాష్మినా శాలువాను బహుమతిగా ఇచ్చారు. లడఖ్‌లోని చాంగ్‌తంగి మేక ఉన్నితో తయారు చేసిన ఈ పాష్మినా శాలువా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని కాశ్మీరీ కళాకారులు సాంప్రదాయ పద్ధతిలో చేతితో నేస్తారు. ఈ శాలువా ఒకప్పుడు రాజ కుటుంబాలు ధరించిన చరిత్ర కలిగి ఉంది. భారత ప్రధాని జపాన్ పర్యటనలో ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇరు దేశాల ప్రధానులు ఇండియా – జపాన్ ఆర్థిక వేదికలో సమావేశమయ్యారు. ముందుగా జపాన్ ప్రధాని ఇషిబా ప్రధాని మోదీని అధికారికంగా స్వాగతించారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. అనంతరం జపాన్‌లో భారత ప్రధాని తన పర్యటన ముగించుకొని చైనా బయలుదేరి వెళ్లారు.

Tags:    

Similar News