PM Modi- Putin: ఆ 45 నిమిషాలు ఏం మాట్లాడుకున్నామంటే .. పుతిన్
ఒకే కారులో మోడీ, పుతిన్ ప్రయాణం..
గత వారం చైనాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారు ప్రయాణం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పెద్దపెద్ద సదస్సుల్లో దేశాధినేతలు వేర్వేరు కార్ల కాన్వాయ్‌ల్లో వేదికల వద్దకు చేరుకొంటారు. కానీ, తింజియన్‌లోని షాంఘై సహకార సదస్సులో మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కారులో బయల్దేరి వేదిక వద్దకు చేరుకోవడం విశేషం. ఇద్దరూ దాదాపు 45 నిమిషాలు పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కానీ.. వీరి భేటీలో ఏ అంశంపై చర్చించారో స్పష్టంగా తెలియలేదు. తాజాగా ఈ అంశంపై పుతిన్ స్పందించారు.
పుతిన్ విలేకరులతో మాట్లాడుతూ.. తాము ఎలాంటి సీక్రెట్‌లు మాట్లాడుకోలేదని స్పష్టం చేశారు. అలాస్కాలో జరిగిన సంభాషణ గురించి తాను మోడీకి తెలియజేసినట్లు చెప్పారు. ట్రంప్‌తో తన సంభాషణ బ్రోకెన్ ఇంగ్లీష్‌లోనే జరిగిందని పుతిన్ తెలిపారు. తాము 30 సెకన్లు మాత్రమే మాట్లాడుకున్నామన్నారు. ట్రంప్ ఆరోగ్యంగా ఉండటం చూసి సంతోషంగా ఉన్నానని ట్రంప్‌తో చెప్పినట్లు వెల్లడించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం అంశంపై ఆగస్టులో అలాస్కాలో పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన విషయం తెలిసిందే. అయితే, ఇద్దరి మధ్య ఎటువంటి ఖచ్చితమైన ఒప్పందం కుదరలేదు. ఈ సమావేశం అనంతరం అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా అలాస్కాలో జరిగిన సమావేశం గురించి భారత్‌కు సమాచారం అందించారు.
కాగా.. SCO శిఖరాగ్ర సమావేశ వేదిక నుంచి రిట్జ్-కార్ల్టన్ హోటల్‌కు ప్రధాని మోడీతో పాటు ప్రయాణించాలని అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా కోరుకున్నారని తెలిసింది. ఇందు కోసం పుతిన్ స్వయంగా ప్రధాని మోడీ కోసం దాదాపుగా 10 నిమిషాలు వేచి చూశారు, చైనా నుంచి పుతిన్‌కి గిఫ్ట్‌గా వచ్చిన ఆరస్ సెడాన్ కారులో కలిసి ప్రయాణించారు. పుతిన్, మోడీ మధ్య స్నేహంపై అంతర్జాతీయ మీడియా విస్తృత కవరేజ్ ఇచ్చింది. ప్రధాని మోడీ సైతం ‘‘ఎస్‌సీవో సదస్సు వేదిక వద్ద ప్రొసీడింగ్స్ ముగిసిన తర్వాత.. అధ్యక్షుడు పుతిన్, నేను కలిసి ఒకే కారులో మా ద్వైపాక్షిక భేటీ వేదిక వద్దకు చేరుకొన్నాం. ఇద్దరి మధ్య చర్చలు ఎప్పుడూ లోతుగా జరుగుతాయి’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇరు దేశాధినేతల మధ్య నెలకొన్న స్నేహబంధానికి ఈ జర్నీ గుర్తుగా నిలిచింది. వీరిద్దరి మధ్య చర్చలు, పలకరింపులకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇది కాదా భారత్-రష్యాల మధ్య స్నేహం అంటే అని నెటిజన్లు కామెంట్స్ చేశారు.