China Population: చైనా జనాభాలో క్షీణత

‘నో మ్యారేజ్-నో చైల్డ్ ’ చైనాలో యువత నినాదం

Update: 2024-03-08 00:30 GMT

దేశ జనాభా తగ్గుతున్న వేళ వివాహం, సంతానం విషయంలో చైనా యువత ఆలోచనల్ని మార్చేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా అవేమీ ఫలించడం లేదు. స్వేచ్ఛ..ఆర్థిక ఒడుదొడుకులు..బాధ్యతలు, కెరీర్‌ వంటి ఆలోచనలతో చైనా యువతులు తాము ఒంటరిగానే ఉంటామంటూ స్పష్టం చేస్తున్నారు. "నో మ్యారేజ్, నో చైల్డ్‌" అంటూ నినదిస్తున్నారు. తామే చివరితరం అంటూ ప్రస్తావిస్తున్నారు.

దేశంలో వివాహం, శిశుజననాల రేటు గణనీయంగా పడిపోతుండటంతో చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. యువతలో మార్పు రావాలని అంటోంది. చైనాలో గతేడాది నమోదైన శిశు జననాల రేటు 60 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. 2023లో 68.3 లక్షల వివాహాలు మాత్రమే నమోదయ్యాయి. 1983 తర్వాత ఇదే అత్యల్పం కావడం గమనార్హం. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలను చూస్తున్న చైనా యువత... సంప్రదాయాలను పాటించేందుకు కూడా విభేదిస్తున్నారు. చైనాలో వివాహాన్ని అన్యాయమైన వ్యవస్థగా చూస్తున్నారని.. ఇది చాలా ప్రమాదకరంగా మారబోతోందని ఆ దేశ నాయకత్వం మథనపడుతోంది. చైనాలోని చాలా మంది బాలికలు  భర్త, పిల్లలు లేని భవిష్యత్తును ఊహించుకునే పెరుగుతున్నారు. దీనివల్ల వారికి వివాహంపై సదాభ్రిపాయం ఉండడం లేదు. దీనిని దూరం చేసేందుకు చైనా ప్రభుత్వం  ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. మునుపటి తరాలలో వివాహం చేసుకున్న చాలామంది మహిళలు... తమ కెరీర్‌ను త్యాగం చేశారని.. సంతోషకరమైన జీవితాన్ని పొందలేకపోయారనిఈ రోజుల్లో అలా సొంత జీవితాన్ని త్యాగం చేయడం చాలా కష్టమైన పనని చైనా యువతులు  అభిప్రాయపడుతున్నారు.నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, అభద్రతకు తోడు విద్యావంతులైన స్త్రీల సంఖ్య పెరగడం కూడా చైనా యువతులు పెళ్లి చేసుకోకపోవడానికి కారణంగా తెలుస్తోంది.

2021 అధికారిక గణాంకాల ప్రకారం చైనాలో 15 ఏళ్లుదాటిన యువత దాదాపు 24 కోట్లమంది ఉన్నారు. ఇటీవల జరిపిన ఓ సర్వేలో..దాదాపు 44 శాతం మంది యువతులు వివాహం చేసుకునేందుకు సిద్ధంగా లేరని వెల్లడైంది. చైనాలో 2010లో వివాహం చేసుకునే సగటు వయస్సు 24 ఏళ్లు ఉండగా ఇప్పుడు అది 29 ఏళ్లకు పెరిగింది. పురుషులలో పెళ్లి సగటు వయస్సు 30 ఏళ్లకు స్ర్తీలలో 29 ఏళ్లకు పెరగడం చైనా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఒంటరి జీవనశైలి చైనాలో మరింత విస్తృతంగా మారుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళలు చాలామంది.. "నో మ్యారేజ్, నో చైల్డ్‌" అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌లు చేస్తుండగా వాటికి వేలల్లో లైక్‌లు వస్తున్నాయి. 

పిల్లల పెంపకం విషయంలో పురుషులకు సరైన జ్ఞానం లేదని అదే చైనాలో యువతులు పెళ్లి చేసుకోకపోవడానికి ప్రధాన కారణమని ఓ అధ్యయనం వెల్లడించింది. వయసు పెరిగినప్పుడు చేసుకునే వివాహాలు.. సంతానోత్పత్తి పడిపోవడం చైనా జనాభా లక్ష్యాలకు ముప్పు కలిగిస్తోందని నమ్ముతున్నారు. చైనా ఎదుర్కొనే అతి ముఖ్యమైన దీర్ఘకాలిక సంక్షోభం ఇదే అని ఓ పరిశోధకురాలు వెల్లడించారు.  

Tags:    

Similar News