Russia: మెసేజింగ్ యాప్ నుంచే మాస్కో దాడికి కుట్ర
కేవలం మెసేజింగ్ టెలిగ్రామ్ యాప్ నుంచే అంతా ..;
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భీకర ఉగ్రదాడిని కేవలం ఒక మెస్సేజింగ్ యాప్ ద్వారానే ఐసిస్ నిర్వహించింది. ప్రత్యక్ష కాల్పులకు దిగిన ముష్కరులకు.. అసలు తమకు డబ్బు ఎలా అందిందో.. ఎవరు ఇచ్చారో కూడా తెలియకపోవడం గమనార్హం. సినిమాల్లో చూపెట్టినట్లుగా.. కొందరు షాడో మ్యాన్‌లు నలుగురు ఉగ్రవాదులను కీలుబొమ్మలుగా ఆడించారు. మరోవైపు ఉగ్రదాడి అనంతరం ముష్కరులు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు యత్నించగా బంధించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఉగ్రవాదులంతా తజికిస్తాన్ పౌరులుగా గుర్తించారు.
మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాలులో దాడి చేసిన ముష్కరులను కేవలం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ నుంచే ఐసిస్ ఉగ్రసంస్థ నడిపించింది. వీరికి ఆదేశాలు ఇచ్చింది ఎవరో కూడా ప్రత్యక్ష కాల్పులకు దిగిన నలుగురు ముష్కరులకు తెలియదు. తమకు డబ్బు ఎలా అందింది. ఆయుధాలు ఇచ్చింది ఎవరో కూడా వారికి తెలియకపోవడం గమనార్హం. తప్పించుకుని పారిపోతున్న నలుగురు ఉగ్రవాదులను బ్రియాన్స్క్‌లోని ఖట్సన్ అనే గ్రామంలో రష్యా ప్రత్యేక దళాలు అరెస్టు చేశాయి. ఒకరిని మోకాళ్లపై కూర్చోబెట్టి దళాలు ప్రశ్నించగా.. అతడు రష్యన్ భాషలో మాట్లాడాడు. డబ్బుల కోసమే ప్రజలపై కాల్పులు జరిపానని చెప్పాడు. తెలియని వ్యక్తులు తమను సంప్రదించి 5 లక్షల రూబుళ్లను ఆఫర్ చేశారనీ, అందులో సగాన్ని ముందుగా బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు వివరించాడు. దాడి తర్వాత ఆయుధాల్ని రోడ్డు పక్కన పారేసినట్లు మరో దుండగుడు తెలిపాడు. తామంతా తజికిస్థాన్‌కు చెందిన వారమని విచారణలో వెల్లడించాడు.
ఉగ్రదాడిలో క్రాకస్ సిటీహాలు ఎంత తీవ్రంగా దెబ్బతిందో తెలిపే దృశ్యాలు విడుదల అయ్యాయి. ముష్కరుల దాడి తర్వాత అక్కడ మంటలు చెలరేగి.. క్రమక్రమంగా క్రాకస్ సిటీహాల్ మొత్తం వ్యాపించాయి. చివరకు ఆ హాల్ పైకప్పు పూర్తిగా ఊడి కిందపడింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం శిథిలాల గుట్టను తలపిస్తోంది. అధికారులు శిథిలాలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా.. శనివారం జరిగిన ఈ దాడిలో ఇప్పటి వరకు 133 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నిందితులతో పాటు మరో 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. ఈ దాడిని తామే చేసినట్లు అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ ఇప్పటికే వెల్లడించింది. తాము మిషిన్‌గన్‌లు, బాంబులు, కత్తులతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పేర్కొంది.
మరోవైపు ఉగ్రదాడి అనంతరం ముష్కరులు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు యత్నించగా బంధించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ మాత్రం ఈ దాడిలో తమ పాత్రమే లేదని చెబుతోంది. ఈ దాడిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థే చేసిందని అమెరికా కూడా ధ్రవీకరించింది. ఇందులో ఉక్రెయిన్ ప్రభుత్వ పాత్రేమీ లేదని తెలిపింది. ఉగ్రవాదులంతా తజికిస్తాన్ పౌరులుగా గుర్తించారు. అఫ్గానిస్తాన్‌తో తజికిస్తాన్ సరిహద్దును కలిగి ఉంది.