Mpox: ఎంపాక్స్‌ కొవిడ్‌ కాదు.. కానీ ..

అరికట్టడంలో ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు కీలకమన్న WHO;

Update: 2024-08-21 04:15 GMT

ఎంపాక్స్‌ కొత్త కొవిడ్‌ కాదని, దాని వ్యాప్తిని అరికట్టడంలో ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు కీలకమని డబ్ల్యూహెచ్‌వో యూరప్‌ ప్రాంతీయ సంచాలకులు హన్స్‌ క్లుగె మంగళవారం తెలిపారు. ఎంపాక్స్‌ను ఎదుర్కోవడం, నిర్మూలించడంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాధిని ప్రపంచం ఎలా ఎదుర్కొంటుందనేది భవిష్యత్తులో ప్రజారోగ్య రక్షణకు కీలక పరీక్ష లాంటిదని హెచ్చరించారు.

డబ్ల్యూహెచ్‌ఓలో యూరప్‌ రీజినల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న హాన్స్‌ క్లుగే మీడియాతో మాట్లాడుతూ.. ఎంపాక్స్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు, నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమయంలో ప్రపంచం స్పందించే తీరు కీలకమని వ్యాఖ్యానించారు. ‘‘దీనిని కలిసికట్టుగా ఎదుర్కోవాలి. మనం ఈ వైరస్‌ను నియంత్రిస్తామా..మరోసారి నిర్లక్ష్యం, భయం వైపు వెళ్తామా..అనేది మన స్పందనపై ఆధారపడి ఉంటుంది. రానున్న ఏళ్లలో ఐరోపా, ప్రపంచానికి ఇది మరో పరీక్షే’’ అని హెచ్చరించారు.

ఇదిల ఉంటే..మంకీపాక్స్‌పై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు..బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని నౌకాశ్రయాల దగ్గర కూడా నిఘా పెంచాలని, మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్న వారెవరైనా కనిపిస్తే వెంటనే తెలపాలని పేర్కొంది. మంకీపాక్స్‌ వైరస్‌ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు, చికిత్స చేసేందుకు వీలుగా దేశరాజధాని దిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా, సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింగ్‌ ఆసుపత్రులను ఆరోగ్యమంత్రిత్వశాఖ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్‌ నోడల్‌ కేంద్రాలుగా తమ పరిధిలోని కొన్ని ఆసుపత్రులను గుర్తించాలని పేర్కొంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. 2022 నుంచి ఇప్పటివరకు 116 దేశాలకు ఎంపాక్స్‌ (Mpox) వైరస్‌ విస్తరించింది. మొత్తం 99,176 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాంగోలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 15,600 కేసులు నమోదు కాగా 537 మరణాలు సంభవించాయి. భారత్‌లో 2022 నుంచి ఇప్పటివరకు 30 ఎంపాక్స్‌ కేసులు రికార్డయ్యాయి. మార్చి 2024లో చివరి కేసు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ తర్వాత దేశంలో ఎటువంటి ఎంపాక్స్‌ కేసులు కొత్తగా నమోదు కాలేదని తెలిపింది. మరోపక్క పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో నలుగురిలో ఈ వైరస్‌ను గుర్తించారు.

ప్రపంచదేశాలను కలవరపరుస్తున్న మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) వ్యాధికి టీకాను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్టు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా మంగళవారం వెల్లడించారు. ఏడాదిలోగా దీనిపై సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. కాగా, ఇటీవల కాలంలో ఈ వ్యాధి ముఖ్యంగా ఆఫ్రికా దేశాలలోవిజృంభిస్తుండటంతో డబ్ల్యూహెచ్‌వో దీనిని ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

Tags:    

Similar News