సూర్యగ్రహణ అధ్యయనానికి నాసా జెట్‌లు

నేటి సంపూర్ణ సూర్యగ్రహణం కోసం శాస్త్రవేత్తల ఉత్కంఠ

Update: 2024-04-08 02:15 GMT

సూర్యగ్రహణాన్ని మరింత అధ్యయనం చేయడానికి నాసా జెట్‌ ప్లేన్‌లను ఉపయోగించబోతున్నది. సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఉత్తర అమెరికాలో గ్రహణం కనిపించనుంది. ఈ నేపథ్యంలో సూర్యుడికి సంబంధించిన అనేక రహస్యాలను చేధించేందుకు సూర్యగ్రహణాన్ని ఉపయోగించుకోవాలని నాసా భావిస్తున్నది. ముఖ్యంగా సూర్యుడి బాహ్య వాతావరణం, భూమి అయనావరణపై సూర్యుడు చూపిస్తున్న ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు, సూర్యుడి కాంతి వల్ల కనిపించకుండా ఉన్న గ్రహశకలాలను గుర్తించేందుకు అధ్యయనం చేయనున్నది.

ఇందుకుగానూ ప్రత్యేక పరికరాలు అమర్చిన రెండు డబ్ల్యూబీ-57 జెట్‌ ప్లేన్లను వినియోగించనుంది. ఈ జెట్‌ ప్లేన్లు గంటకు 740 కిలోమీటర్ల వేగంతో 50 వేల అడుగుల ఎత్తున ప్రయాణించగలవు. మేఘాల అడ్డంకి లేకుండా స్పష్టమైన ఫొటోలు తీసుకునేందుకు వీలుగా ఈ జెట్‌లను వినియోగిస్తున్నది.

ఏప్రిల్ 8 సోమవారం ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే వీలున్న ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, గ్రహణ సమయంలో, నాలుగు నిమిషాల తొమ్మిది సెకన్లపాటు చీకట్లోకి వెళ్లనున్నాయి. గతంలో ఏర్పడిన సూర్య గ్రహణాల కన్నా ఇది ఎక్కువ సమయమని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే, ఈసారి శాస్త్రవేత్తలు కూడా చాలా ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

సూర్యుడితో పోలిస్తే చంద్రుడు భూమికి 400 రెట్లు దగ్గరగా ఉంటాడు. పరిమాణంలో సూర్యుడి కన్నా చంద్రుడు 400 రెట్లు చిన్నగా ఉంటాడు. సూర్యుడికీ, భూమికీ మధ్య చంద్రుడు వచ్చి, సూర్యుడు పూర్తిగా కనిపించని స్థితిని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. ఏప్రిల్ 8న ఏర్పడడే సంపూర్ణ సుదీర్ఝ సూర్య గ్రహణం ఉత్తర అమెరికా ఖండంలో పూర్తిగా కనపడుతుంది. అమెరికా, కెనడాలలోని ప్రజలతోపాటు మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లోని వారు కూడా చూసేందుకు అవకాశం ఉంది.  

వన్యప్రాణులపై గ్రహణం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు నార్త్ కరోలినాలోని ఎన్‌సీ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం చేపట్టనుంది. టెక్సాస్‌ రాష్ట్రంలో ఉన్న పలు జంతు ప్రదర్శన శాలల్లో 20 జంతువులపై ఈ అధ్యయనం చేయనున్నారు.అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కూడా జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసేందుకు ఎక్లిప్స్ సౌండ్‌స్కేప్ ప్రాజెక్ట్ రూపొందించింది.సంపూర్ణ గ్రహణ ప్రభావానికి లోనయ్యే ప్రదేశాల్లో ఉండే జంతువులపై ఈ అధ్యయనం చేయనున్నారు. గ్రహణం వల్ల ఏర్పడే చీకటిలో అవి ఎలా స్పందిస్తాయో తెలుసుకునేందుకు వీలుగా వాటి సమీపంలో మైక్రోఫోన్‌లు ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News