వైట్‌హౌస్‌లో బట్టలు ఉతికించుకుంటున్న ఇజ్రాయిల్ ప్రధాని..
పర్యటనలో భాగంగా ఆయన వెంట బ్యాగులు, సూట్‌కేసుల్లో విడిచిన బట్టలు తీసుకొని వస్తారు. వాటిని అక్కడి సిబ్బంది ఉతికి ఇస్తారు.;
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్ అధికారిక పర్యటనకు వచ్చిన ప్రతిసారి తనతో పాటు ఉతకాల్సిన బట్టల బ్యాగులను తీసుకువచ్చే అలవాటు ఉందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఇజ్రాయెల్ రాజకీయాల్లో అగ్రస్థానంలో ఉన్న నెతన్యాహు 1990 ల నాటి నుండి సుదీర్ఘపాలన సాగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ పదవిలో ఉన్నప్పుడు నెతన్యాహు పదవిలో లేనప్పటికీ, అమెరికా పర్యటనల సందర్భంలో అధ్యక్షులు క్లింటన్, ఒబామా, ట్రంప్‌లతో సమావేశమయ్యారు.
నేతన్యాహు అమెరికాలో అధికారికంగా పర్యటించిన ప్రతిసారీ వైట్‌హౌస్‌కు చెందిన అధికారిక అతిథి భవనమైన బ్లెయిర్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటారు. పర్యటనలో భాగంగా ఆయన వెంట బ్యాగులు, సూట్‌కేసుల్లో విడిచిన బట్టలు తీసుకొని వస్తారు. వాటిని అక్కడి సిబ్బంది ఉతికి ఇస్తారు. విదేశీ నాయకులందరికీ అందుబాటులో ఉన్న ఉచిత లాండ్రీ సేవను నెతన్యాహు సద్వినియోగం చేసుకుంటారని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా నెతన్యాహు ఎదుర్కొన్నారు. అయితే, ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు ఈ ఆరోపణను ఖండిస్తున్నారు. అధికారిక సందర్శనలలో నెతన్యాహు మాత్రమే మురికి బట్టల సూట్‌కేసులు తీసుకువచ్చి ఉతకడానికి ఇస్తారని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నపని అని వారు నేతన్యాహుపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.