Benjamin Netanyahu: మళ్ళీ వాయిదా పడిన నెతన్యాహు భారత పర్యటన
ఈ ఏడాది నెతన్యాహు టూర్ రద్దు కావడం ఇది మూడోసారి
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు, తదనంతర భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆయన పర్యటన రద్దు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
వాస్తవానికి, ఈ ఏడాది సెప్టెంబర్ 9న నెతన్యాహు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ, సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్ పార్లమెంటులో ఓటింగ్ జరగడంతో ఆ పర్యటన రద్దయింది. అంతకుముందు ఏప్రిల్‌లో కూడా ఆయన పర్యటన ఇదే విధంగా వాయిదా పడింది. ఇప్పుడు ఢిల్లీ పేలుడు కారణంగా మూడోసారి పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ, నెతన్యాహు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నెతన్యాహు చివరిసారిగా 2018 జనవరిలో భారత్‌ను సందర్శించారు. అంతకుముందు 2017లో ప్రధాని మోదీ టెల్ అవీవ్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు.
తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది పర్యటనకు కొత్త తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నవంబర్ 10న ఢిల్లీలో జరిగిన పేలుడులో 15 మంది మరణించారని, పలువురు గాయపడ్డారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలోనే నెతన్యాహు పర్యటన వాయిదా పడినట్లు స్పష్టమవుతోంది.