Benjamin Netanyahu: ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాం: ఇజ్రాయిల్ ప్రధాని
ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకారం;
ఇరాన్‌తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ తెలిపారు. ఒకవేళ ఎటువంటి అతిక్రమణ జరిగినా.. అప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతామన్నారు. గత 12 రోజులుగా ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య భీకర వైమానిక దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇరాన్‌లో ఉన్న న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడి చేసిన తర్వాత.. ఇరు దేశాల మధ్య కాల్పుల విమరణ డీల్ కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికా చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం దీనిపై ప్రటకన చేసింది. క్యాబినెట్, రక్షణ మంత్రి, ఐడీఎఫ్ చీఫ్, మొసాద్ అధినేతతో పాటు కీలక నేతల్ని ప్రధాని నెతన్యహూ చర్చించారని, ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యాలను అందుకున్నట్లు పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. న్యూక్లియర్, బాలిస్టిక్ మిస్సైళ్ల నుంచి పొంచి ఉన్న ప్రమాదం పోయిందని ఇజ్రాయిల్ చెప్పింది.
ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా ఐడీఎఫ్ ఆధీనంలో తీసుకున్నట్లు ఆ ప్రకటనలో చెప్పారు. ఇరాన్‌లో కీలక టార్గెట్లపై అటాక్ చేశామని, ఆ దేశ సైనిక నేతలకు తీవ్ర నష్టం జరిగినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. తమకు సపోర్టు ఇచ్చినందుకు, అణు భయాన్ని తొలగించినందుకు అమెరికాకు థ్యాంక్స్ చెబుతున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యాలు నెరవేరిన సందర్భంగా.. ప్రెసిడెంట్ ట్రంప్ సహకారం మేరకు.. ద్వైపాక్షిక సీజ్‌ఫైర్‌కు అంగీకరించామని ఇజ్రాయిల్ పీఎంవో తెలిపింది.